కల నిజమాయెగా..! | Jewar farmers make air travel debut boarding first Noida Airport flight | Sakshi
Sakshi News home page

కల నిజమాయెగా..!

Jun 16 2026 1:42 AM | Updated on Jun 16 2026 1:42 AM

Jewar farmers make air travel debut boarding first Noida Airport flight

నోయిడా విమానాశ్రయంలో మొదలైన విమానాల సందడి 

జెవార్‌ ప్రాంత రైతులతో మొదటి విమానం  

లక్నోలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ 

తమ కల నిజమైందంటూ హర్షాతిరేకాలు

నోయిడా/లక్నో: మార్చిలో ప్రధాని మోదీ ప్రారంభించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి విమానాల రాకపోకలు మొదలయ్యాయి. ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి తమ భూములిచ్చిన జెవార్‌ ప్రాంతానికి చెందిన 170 మంది రైతులతో కూడిన మొట్టమొదటి విమానం లక్నోకు బయలుదేరింది. ఈ బృందంలో 28 మంది మహిళలతోపాటు 170 మంది గ్రామస్తులున్నారు. వీరందరినీ యూపీ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్‌ వెంటబెట్టుకెళ్లారు. 

లక్నోలోని తన నివాసం వద్ద వీరందరికి సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఇతర ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రైతులతో సమావేశమయ్యారు. వీరంతా గౌతమబుద్ధ నగర్‌లోని జెవార్‌ ప్రాంతానికి చెందిన వారు. వీరిలో 99 శాతం మంది రైతులు గతంలో ఎన్నడూ విమానంలో ప్రయాణం చేయని వారే. ఈ సందర్భంగా రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. విమానంలో ప్రయాణించాలన్న తమ చిరకాల కోరిక సాకారమైందన్నారు. 

‘ఈ అరుదైన అనుభవాన్ని ఎన్నటికీ మర్చిపోలేం. ఈ సంతోషాన్ని మాటల్లో వరి్ణంచలేం. మా భూముల్లో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంతో ఎందరికో ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించడం చూసి సంతోషంగా ఉంది’అని వారు సీఎం యోగికి చెప్పారు. తమ భూములకు తగిన పరిహారం అందించేలా చేయడంతోపాటు, తమకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం యోగికి వారు ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు, లక్నోకు మొదటిసారిగా బయలుదేరిన ఇండిగో విమానంలో రైతుల కోసం ప్రత్యేకంగా ఒక అనౌన్స్‌మెంట్‌ చేశారు. ‘తమ కష్టార్జితంతో ఈ భూమిని సాగు చేసి, అభివృద్ధి కోసం త్యాగం చేసిన రైతులు.. ఈ రోజు అదే స్థలం నుంచి విమాన ప్రయాణం చేస్తున్నారు. ఇది పరస్పర నమ్మకం, భాగస్వామ్యం, ప్రగతికి ఒక నిదర్శనం’అని ఎమ్మెల్యే సింగ్‌ ప్రకటించారు.  

ఒక్కటే రన్‌ వే 
లక్నోలో రైతులతో ఏర్పాటైన సమావేశంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌తోపాటు, సీఎం సలహాదారు అవనీశ్‌ కుమార్‌ అవస్థి, మంత్రి సురేశ్‌ కుమార్‌ ఖన్నా, అదనపు ప్రధానకార్యదర్శి(పౌర విమానయాన) దీపక్‌ కుమార్, యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ సీఈవో రాకేశ్‌ సింగ్, ఇండిగో, నోయిడా విమానాశ్రయం ప్రతినిధులు పాల్గొన్నారు. 2021 నవంబర్‌ 25వ తేదీన ప్రధాని మోదీ ఈ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది మార్చి 28వ తేదీన ప్రారంభించారు. ప్రస్తుతానికి ఒకటే రన్‌వే ద్వారా ఏడాదికి 1.2 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యంతో నిర్మించిన ఈ విమానాశ్రయాన్ని భవిష్యత్తులో ఐదు రన్‌వేలతో 22.5 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలకు వీలయ్యేలా విస్తరించనున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement