ప్రధాని మోదీ సమక్షంలో బిహార్ సీఎంగా నితీశ్ ప్రమాణం
సామాజిక సమతుల్యత పాటిస్తూ పాత, కొత్త ముఖాలతో కేబినెట్ కూర్పు
పట్నా: ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్ పేలవ ప్రదర్శన, తమ ప్రభుత్వ ప్రజారంజక పాలనతో మరోసారి అధికార పగ్గాలు ఒడిసిపట్టిన జేడీయూ అగ్రనేత నితీశ్ కుమార్ గురువారం బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణంచేశారు. పట్నాలోని చారిత్రక గాంధీ మైదాన్ ఈ ప్రమాణోత్సవానికి వేదికైంది. గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ నితీశ్‌తో సీఎంగా ప్రమాణం చేయించారు.
ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, జేడీయూ, బీజేపీ ముఖ్యనేతల సమక్షంలో 74 ఏళ్ల నితీశ్ సీఎంగా ప్రమాణంచేశారు.
ఆపద్ధర్మ ప్రభుత్వంలోనూ డిప్యూటీ సీఎంలుగా కొనసాగుతున్న సామ్రాట్ చౌదరి, విజయ్‌కుమార్ సిన్హాలతోపాటు బీజేపీ నుంచి 14 మంది, జేడీయూ నుంచి ఎనిమిది మంది, లోక్‌జనశక్తి(రాంవిలాస్) పార్టీ నుంచి ఇద్దరు, హిందుస్తానీ ఆవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చాల నుంచి చెరొకరు మంత్రులుగా ప్రమాణంచేశారు. కేబినెట్ బెర్తుల కేటాయింపులో నితీశ్ సామాజిక సమతుల్యత పాటించారు. 26 మందిలో ఐదుగురు దళితులకు చోటిచ్చారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకాని దీపక్‌కు కేబినెట్‌లో చోటు
ప్రతిసారీ ఎమ్మెల్సీ మార్గంలో సీఎం కుర్చీపై కూర్చుంటున్న నితీశ్ ఈసారి తనలాగా మరో వ్యక్తిని కేబినెట్ మంత్రిని చేశారు. రాష్ట్రీయ లోక్‌మోర్చా పార్టీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహా కుమారుడు దీపక్ ప్రకాశ్ సైతం గురువారం మంత్రిగా ప్రమాణంచేయడం చూసి అక్కడివారంతా ఆశ్చర్యపోయారు. దీపక్ ప్రస్తుతం ఎమ్మెల్యేకాదు, ఎమ్మెల్సీ అస్సలు కాదు. విదేశాల్లో చదువుకుని వచ్చిన దీపక్‌ను ఉన్నపళంగా మంత్రిని చేసినట్లు తెలుస్తోంది.
ఇక డబుల్ ఇంజిన్ పాలన: అమిత్ షా
ప్రమాణస్వీకారం సందర్భంగా అమిత్‌షా తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్‌చేశారు. ‘‘నేటి నుంచి బిహార్‌లో మరింత శక్తివంతమైన డబుల్ ఇంజిన్ ప్రభుత్వపాలన జోరందుకోవడం ఖాయం’’ అని అమిత్ షా అన్నారు.
నాన్నను గెలిపించినందుకు థాంక్యూ: నిశాంత్
ప్రమాణస్వీకార కార్యక్రమంలో నితీశ్ తనయుడు నిశాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 50 ఏళ్ల నిశాంత్ ఇంతవరకు రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదు. తండ్రి రెండు దశాబ్దాలుగా సీఎంగా జనరంజకంగా పాలిస్తున్నా మీరెందుకు రాజకీయాల్లోకి రాలేదని మీడియా ప్రశ్నించగా ఆయన చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. ఎలాంటి సమాధానం చెప్పలేదు.
ప్రత్యేకంగా అభినందించిన ప్రధాని
కార్యక్రమం తర్వాత ప్రధాని ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘పదోసారి సీఎంగా పగ్గాలు స్వీకరించిన నితీశ్‌కు నా శుభాకాంక్షలు. ఏళ్లతరబడి సుపరిపా లన అందించిన అనుభవశీలి నితీశ్. డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్‌లకు నా అభినందనలు. వీళ్లిద్దరూ ప్రజాసేవ కోసం అవిశ్రాంతంగా క్షేత్రస్థాయిలో పనిచేశారు. పాత, కొత్త ముఖాల కలబోతగా కొలువుతీరిన కేబినెట్ ఇకపై బిహార్‌ను అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరుస్తుంది’’అని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
19 ఏళ్లుగా అధికారంలోనే..
50 ఏళ్ల రాజకీయ అనుభవం గడించిన నితీశ్ పని అయిపోయిందనుకున్న ప్రతిసారీ ఉవ్వెత్తున ఎగిసే అలలా మరింత ప్రజాదరణతో సీఎం పీఠంపై ఆసీనులవుతున్నారు. 1970 దశకంలో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్‌తో పాటు బిహార్ ఉద్యమంలో పాల్గొని నితీశ్ పెద్దనేతగా ఎదిగారు. మండల్ కమిషన్ రిజర్వేషన్ల అమలు తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలకనేతగా మారారు. తర్వాత అవకాశవాదిగా ముద్రపడినప్పటికీ ఆయనకు జనాదరణ తగ్గకపోవడం విచిత్రం.
తాజా ఎన్నికల్లో గణమైన స్థాయిలో సీట్లు సాధించి కూడా బీజేపీ ఈయనకే సీఎం కుర్చీ అప్పగించడం నితీశ్ రాజకీయ చాణక్యతకు మచ్చుతునక. దేశంలో సుదీర్ఘకాలంపాటు పరిపాలించిన 10 మంది ముఖ్యమంత్రుల్లో నితీశ్ ఒకరు. గత 19 ఏళ్లుగా ఈయన సీఎంగా కొనసాగుతున్నారు. ఎప్పుడూ కూటములు మార్చే పల్టీబాబుగా చెడ్డపేరు తెచ్చుకున్నా చక్కటి పాలనతో సుశాసన్‌బాబు అనే ఖ్యాతినీ సాధించడం విశేషం. విద్యరీత్యా ఇంజనీర్ అయిన నితీశ్ తన కేబినెట్‌లోనూ సోషల్ ఇంజనీరింగ్‌చేసి అన్ని వర్గాల వారికి సమప్రాధాన్యత కల్పించారు.


