తమిళనాట ‘20% కమీషన్ల’ పాలన  | Union Home Minister Amit Shah accuses DMK and Stalin of multiple scams and corruption | Sakshi
Sakshi News home page

తమిళనాట ‘20% కమీషన్ల’ పాలన 

Jan 5 2026 5:04 AM | Updated on Jan 5 2026 7:41 AM

Union Home Minister Amit Shah accuses DMK and Stalin of multiple scams and corruption
  • విచ్చలవిడిగా అవినీతి రాజ్యమేలుతోంది  
  • వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేదే విజయం  
  • బీజేపీ అగ్రనేత అమిత్‌ షా ధీమా  

పుదుకొట్టై: తమిళనాడులో డీఎంకే పాలనలో అవినీతి విచ్చలవిడిగా రాజ్యమేలుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షా మండిపడ్డారు. రాష్ట్రంలో ‘20 శాతం కమీషన్ల’ పాలన సాగుతోందని ఆరోపించారు. ప్రతి పనిలో 20 శాతం కమీషన్లు నొక్కేస్తున్నారని, ఇదొక నిబంధనగా మారిపోయిందని షా దుయ్యబట్టారు. తమిళనాడుతోపాటు పశ్చిమ బెంగాల్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. 

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్‌ నాగరత్నన్‌ చేపట్టిన యాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం పుదుకొట్టైతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో అమిత్‌ షా ప్రసంగించారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం తమిళనాడులో ఉందన్నారు. తమిళ భాషను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. తమిళాన్ని మరింత ప్రోత్సహించడానికి పలు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో హిందుమతాన్ని, హిందువులను డీఎంకే తరచుగా కించపరుస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. హరియాణా, ఢిల్లీ, బిహార్‌ తరితర రాష్ట్రాల్లో ఎన్డీయే ఘన విజయం సాధించిందని, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లోనూ అదే ఫలితం పునరావృతం కాబోతోందని స్పష్టంచేశారు.  

కుటుంబ రాజకీయాలకు ఇక చరమగీతం  
తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ దారుణంగా విఫలమైందని అమిత్‌ షా మండిపడ్డారు. ఆ పార్టీ అవినీతికి మారుపేరుగా మారిందన్నారు. క్యాష్‌ ఫర్‌ జాబ్స్‌తోపాటు మనీ లాండరింగ్‌ కేసుల్లో డీఎంకే నాయకుల పేర్లు తెరపైకి వచ్చాయని గుర్తుచేశారు. అవినీతి నేతలుండగా రాష్ట్రం ప్రగతి సాధించడం సాధ్యం కాదని అన్నారు. అప్పులు, మద్యం ఆదాయంతోనే ప్రభుత్వం నడిచే పరిస్థితి ఏర్పడిందన్నారు. 

కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని సీఎం స్టాలిన్‌ ఆరాటపడుతున్నారని, ఆయన ఆశ నెరవేరే ప్రసక్తే లేదని అమిత్‌ షా పేర్కొన్నారు. కుటుంబ రాజకీయాలకు చరమగీతం పాడే సమయం వచ్చిందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించని స్టాలిన్‌ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. డీఎంకే నాయకులు సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూతో పోలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హిందువుల పండుగలకు సైతం అనుమతి ఇవ్వడం లేదన్నారు. హిందువులపై దాడులు జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి స్టాలిన్‌ రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తున్నారని అమిత్‌ షా ధ్వజమెత్తారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement