
న్యూఢిల్లీ: దేశభక్తి, మతం అంశాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించే సినీ రచయిత జావెద్ అఖ్తర్ (80) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, నరకం ఈ రెండింట్లో ఎక్కడికెళతావని అడిగితే తాను నరకాన్నే ఎంచుకుంటానని చెప్పారు. శనివారం రాత్రి ముంబైలో శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ రాసిన పుస్తకం ‘హెవెన్ ఇన్ ది స్వాంప్’(చిత్తడి నేలలో స్వర్గం) ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు.
తనను నాస్తికుడని చెప్పుకునే జావెద్ అఖ్తర్ భారత్, పాకిస్తాన్‌ల నుంచి అతివాదులు నిత్యం తనపై దుర్భాషల వర్షం కురిపిస్తున్నారని వెల్లడించారు. వీరిలో ఎవరైనా నన్ను దూషించడం ఆపేస్తే, చాలా ఆందోళన చెందుతాను. ‘కాఫిర్ అని, నరకానికి వెళ్తావని ఒకరంటే, జిహాదీ, పాకిస్తాన్‌కు పొమ్మంటూ మరొకరు దూషిస్తారు.
పాకిస్తాన్, నరకం ఈ రెండింట్లో ఎటు వెళ్లాలన్న ప్రశ్న వస్తే మాత్రం నేను నరకానికే వెళ్తానంటాను’అంటూ జావెద్ అఖ్తర్ చేసిన వ్యాఖ్యలకు ఆహూతుల కరతాళ ధ్వనులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ‘పౌరులు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారై ఉండరాదు. ఏ ఒక్క పార్టీకీ విధేయత చూపరాదు. అలాంటప్పుడు మాత్రమే పౌరులు ఏది తప్పో, ఏది రైటో చెప్పగలరు’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు.