జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్‌ బరస్ట్‌.. వరద బీభత్సంతో భయానక వాతావరణం | Jammu And Kashmir flash floods And landslides Roads Cut off | Sakshi
Sakshi News home page

జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్‌ బరస్ట్‌.. వరద బీభత్సంతో భయానక వాతావరణం

Apr 20 2025 1:36 PM | Updated on Apr 20 2025 3:08 PM

Jammu And Kashmir flash floods And landslides Roads Cut off

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా కుండపోత వర్షం కురిసింది. రెండు రోజులుగా ఆగకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటి వరకు ముగ్గురు మృతిచెందగా.. సుమారు 100 మందిని సహాయక బృందాలు కాపాడాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వివరాల ప్రకారం.. జమ్ముకశ్మీర్‌‌లో భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా రాంబన్‌ జిల్లాలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.  కొండ చరియలు విరిగి పడడంతో ప్రధాన మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.  బాగ్నా గ్రామంలో ఇల్లు కూలిపోవడంతో ముగ్గురు మరణించారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) రాంబన్ కుల్బీర్ సింగ్ ధృవీకరించారు. మృతులను మొహమ్మద్ అకిబ్ (14), మొహమ్మద్ సాకిబ్ (9), మోహన్ సింగ్ (75) గా గుర్తించారు. వీరందరూ బాగ్నా పంచాయతీ నివాసితులు.

 

మరోవైపు.. చాలా చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు. సుమారు 100మందిని సహాయక బృందాలు రక్షించినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద వాహనాలు చిక్కుకుపోయినట్లు చెబుతున్నారు. పశ్చిమాసియాలోని ప్రత్యేకమైన వాతవరణ పరిస్థితుల వల్లే జమ్మూలో భారీ వర్షాలు, తుఫాను సంభవించిందని వాతావరణ శాఖ తెలిపింది. ఐదేళ్లలో ఇంత భారీ స్థాయిలో వర్షాలు, బలమై గాలులు వీయడం ఇదే మొదటిసారని పేర్కొంది.

ఇదిలా ఉండగా.. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా స్పందిస్తూ.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. రాంబన్‌లో కొండ చరియలు విరిగిపడడం వల్ల తీవ్ర ఆస్తి నష్టం సంభవించిందన్నారు. విపత్తు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇక, జిల్లా అంతటా రెండు హోటళ్ళు, అనేక దుకాణాలు, నివాస నిర్మాణాలు దెబ్బతిన్నాయి. రహదారులన్నీ బురదతో నిండిపోయాయి. మహిళలు, పిల్లలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement
 
Advertisement
Advertisement