సాక్షి, విజయవాడ: మురసు తుఫాన్ ఏపీలోని పలు జిల్లాలను వణికిస్తోంది. తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పట్టణాల్లో రహదారులు చెరువులను తలపిస్తుండగా.. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలుచోట్ల బస్టాండ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి కొన్ని ప్రాంతాలు అంధకారంలో చిక్కుకున్నాయి.
మురసు తుఫాన్ దెబ్బకు విజయవాడ అతలాకుతలమైంది. భారీ వర్షం కారణంగా విజయవాడ రోడ్లు జలమయమయ్యాయి. అపార్ట్మెంట్ల్లోకి భారీగా వరద నీరు చేరుకుంది. లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. ఆటోనగర్, మహానాడు రోడ్డు, నోవాటెల్ రోడ్డు, లయోలా కాలేజీ రోడ్లు జలమయం అయ్యాయి.
8 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు
మురసు తుఫాన్ తీరం దాటినప్పటికీ నెమ్మదిగా కదులుతూ ప్రభావం చూపుతోంది. బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలోనూ ఎడతెరిపి లేని వానతో రహదారులు జలమయమయ్యాయి. తుఫాన్ క్రమంగా బలహీనపడుతూ తెలంగాణ వైపు కదులుతున్నప్పటికీ.. మరో రోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉంది.
కాకినాడ, కోనసీమలో భారీ వర్షాలు
కాకినాడలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్‌లోకి వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్దాపురం, సామర్లకోట, జగ్గంపేట ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరంలో ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో రహదారులు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లోకి కూడా నీరు చేరింది.
తాడేపల్లిగూడెంలో స్తంభించిన జనజీవనం
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనూ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్‌లోకి వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి. తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
బుధవారం వాతావరణం అంచనా #AndhraPradesh #APSDMA #RTGS #CycloneAlert #CycloneMurasu #rain #safety https://t.co/BkGaBXdgai
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) November 4, 2026
ఇదీ చదవండి: పొత్తు ధర్మానికి టీడీపీ తూట్లు


