‘వరద’ లేఖపై రాజకీయ దుమారం | MLA Nandyala Varadarajula Reddy Letter To Minister Narayana | Sakshi
Sakshi News home page

‘వరద’ లేఖపై రాజకీయ దుమారం

Nov 4 2026 11:04 AM | Updated on Nov 4 2026 11:07 AM

MLA Nandyala Varadarajula Reddy Letter To Minister Narayana

ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ పీఠం కేటాయింపు వ్యవహారం.. ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. మున్సిపల్‌ చైర్మన్‌ సీటును జనరల్‌ కేటగిరికి కేటాయించే విషయాన్ని సానుకూలంగా పరిశీలించాలంటూ.. అధికార పార్టీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మంత్రికి రాసిన లేఖ క్షేత్రస్థాయిలో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ లేఖపై నియోజకవర్గంలోని బీసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

అన్నమయ్య జిల్లా: ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ సీటును జనరల్‌ కేటగిరికి కేటాయించే విషయాన్ని సానుకూలంగా పరిశీలించాలని అధికార పార్టీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మంత్రికి రాసిన లేఖతో బీసీలు సర్వత్రా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తమకు పరిపాలించే అర్హత లేదా అని బీసీ వర్గాలకు చెందిన వారు మండిపడుతున్నారు. జిల్లాలో కడప తర్వాత ప్రొద్దుటూరు స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా ఉంది. ఇక్కడ ప్రముఖంగా చేనేత వర్గానికి చెందిన పద్మశాలీయులు, తొగటవీరక్షత్రియలు, దేవాంగులు ఉన్నారు. 

వీరితోపాటు ముస్లిం మైనారిటీలు, యాదవ సామాజిక వర్గంతోపాటు పలు వెనుకబడిన కులాల వారు ఉన్నారు. ఈ ప్రకారం మున్సిపాలిటీ పరిధిలో 1,37,203 ఓట్లు ఉండగా.. వీరిలో దాదాపు సగం మంది బీసీ ఓటర్లు ఉన్నారు. వీరిలోనే అనేక రకాల పదవుల్లో కొనసాగుతున్న నాయకులు ఉన్నారు. మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ కంటే ముందుగానే మున్సిపల్‌ చైర్మన్‌ పదవి బీసీలకే వస్తుందని కొందరు, బీసీలకే ఇవ్వాలని మరికొందరు డిమాండ్‌ చేశారు. చైర్మన్‌ ఎన్నికకు సంబంధించి ప్రత్యక్షంగా ఎన్నికలు జరగడంతో.. రిజర్వేషన్‌ ప్రక్రియ కొత్తగా మొదలవుతుందని, ఈ ప్రకారం తమ జనాభాను బట్టి బీసీలకే మున్సిపల్‌ చైర్మన్‌ పదవి రిజర్వు అవుతుందని ఆశపడ్డారు. 

అయితే చివరికి టీడీపీ అధిష్టానం ప్రకటించిన జాబితాలో మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సోదరుడు నంద్యాల రాఘవరెడ్డి ఉండటంతో అందరి ఆశలు పటాపంచలయ్యాయి. దీని వెనుక ఎమ్మెల్యే సిఫారస్సు ఉందనే విషయం సమాజానికి తెలియదు. మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణకు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి రాసిన లేఖను మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి బయట పెట్టడం సంచలనంగా మారింది. పైగా సమర్థవంతమైన నాయకత్వానికి, ఎన్నికల్లో విజయవంతమైన ఫలితాలకు జనరల్‌ కేటగిరి అభ్యర్థి అయితే అనుకూలంగా ఉంటుందని లేఖలో రాయడం కొసమెరుపు.

మంత్రి నారాయణకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి రాసిన లేఖ 

బీసీలకు అర్హత లేదా.. 
మున్సిపల్‌ చైర్మన్‌గా పరిపాలించే అర్హత బీసీలకు లేదా? సీనియర్‌ ఎమ్మెల్యే అయిన వరదరాజులరెడ్డి ఏ విధంగా లేఖ రాశారు. బీసీలపై ఆయనకు ఉన్న ప్రేమ ఇదేనా? సీఎం చంద్రబాబు సైతం ప్రొద్దుటూరును బీసీలకే కేటాయించకపోవడం దారుణం.  
– భీమునిపల్లి లక్ష్మీదేవి, మున్సిపల్‌ మాజీ చైర్మన్, ప్రొద్దుటూరు

బీసీలకు అన్యాయం చేశారు 
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ప్రధానంగా బీసీ వర్గాలే ఎక్కువగా ఉన్నాయి. రాజకీయంగా చైతన్యవంతులు, మేధావులు ఉన్నారు. ఇవేమి చూడకుండా ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తన సోదరుడి కోసం చైర్మన్‌ పదవిని తెచ్చుకుని బీసీలకు అన్యాయం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేశారు.  
– శేఖర్‌యాదవ్, మాజీ ఎంపీపీ, ప్రొద్దుటూరు మండలం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement