
అప్పుడే వాతావరణ మార్పులపై పోరు
న్యూఢిల్లీ: వాతావరణ మార్పులను తట్టుకుని రైతులు అభివృద్ధి చెందాలంటే భారత్‌లో రైతులకు ఏకంగా 75 బిలియన్ డాలర్ల (రూ.6.4 లక్షల కోట్ల)పెట్టుబడులు అవసరమని ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ (ఐఎఫ్‌ఏడీ)అధ్యక్షుడు అల్వారో లారియో అన్నారు. ప్రపంచవ్యాప్తంగానే గాక భారత్‌లోనూ గ్రామీణ సమాజాలకు సాయం అందించడం అతి పెద్ద సవాలని ఆయన తెలిపారు.
వ్యవసాయాన్ని రైతులకు మరింత లాభదాయకంగా చేయడం, క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో ఉత్పాదకతను పెంచుకోవడం, ఆహార భద్రత నుంచి పోషకాహార భద్రతకు ఎదగడం వంటి అంశాలపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘‘భారత్‌లోని రైతుల్లో చిన్న, సన్నకారు రైతులు 86.2శాతం మంది ఉన్నారు. నీటికొరత, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తరచుగా కరువులు ఎదుర్కొంటున్నారు.
కొన్ని వాతావరణ స్మార్ట్ పద్ధతులను అవలంబించడానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పెట్టుబడులు పెట్టాలి. పంటల వైవిధ్యం, మెరుగైన నీటి నిర్వహణ లేదా సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థలు, కమ్యూనిటీ విత్తన బ్యాంకులను సృష్టించడం, కరువును తట్టుకునే విత్తనాలను ఉపయోగించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఇవి దిగుబడిని పెంచుతాయి’’ అని లారియో తెలిపారు. ‘‘పేదరైతులకు పెట్టుబడులు, వారికి మార్కెట్ అనుసంధానం కీలకం’’ అన్నారు.