అన్నదాత సుఖీభవ.. అంతా మోసం
రెండేళ్లలో ప్రతి రైతుకు రూ.26 వేలు చొప్పున ఎగ్గొట్టిన వైనం
అది కూడా వైఎస్ జగన్ హయాంలో 53.58 లక్షల మందికి ఇస్తే బాబు హయాంలో 46.85 లక్షల మందికే.. ఏకంగా 7 లక్షల మందికి ఎగనామం
రూ.40 వేలకు గాను తాజాగా ఇచ్చిన రూ.4 వేలతో కలిపి ఇచ్చింది రూ.14 వేలే.. వెరసి రూ.14,873.28 కోట్లు బాకీ
రెండేళ్లలో కౌలు రైతులకు రూ. 6,400 కోట్లకు గాను పైసా విదిల్చని సర్కారు
మొత్తంగా అన్నదాతలకు ఈ రెండేళ్లలో రూ.21,273.28 కోట్లు బాకీ
రెండేళ్లలో ఏమీ చేయకపోగా ఉచిత పంటల బీమాకు మంగళం..
సున్నా వడ్డీ ఎగవేత.. వైపరీత్యాల్లో దెబ్బతిన్న రైతులకు రూ.1000 కోట్లకు పైగా ఇన్‌పుట్ సబ్సిడీకి ఎగనామం
ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కక పోయినా ఆదుకోని ప్రభుత్వం
వైఎస్ జగన్ హయాంలో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
ఆ ఐదేళ్లలో రూ.7,577 కోట్ల విలువైన పంట ఉత్పత్తుల కొనుగోలు
రైతులకు అన్నీ కష్టాలే..
ఐదేళ్లుగా నేను ఎకరా భూమిలో కౌలు సాగు చేస్తున్నాను. రెండేళ్లుగా పెట్టుబడి సాయం అందట్లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతు భరోసా సాయం అందింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్నీ కష్టాలే మిగిలాయి. చాలా సార్లు దరఖాస్తు చేసుకున్నాను. ఈ ఏడాదిలో ఈ విడతలోనైనా వస్తుందేమో అని ఆశతో ఎదురు చూశాను. కానీ నా ఆశ నిరాశగానే మారింది. నష్టాలే తప్ప లాభం లేదు. భవిష్యత్తులో కౌలుకు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం.
– పినిశెట్టి అచ్చెంనాయుడు, కేజేపురం, మాడుగుల మండలం, ఉమ్మడి విశాఖ జిల్లా
సాక్షి, అమరావతి: అన్నదాతా సుఖీభవ.. అంటూ చంద్రబాబు ప్రభుత్వం రైతన్నలను నిలువునా మోసగిస్తోంది. ‘అధికారంలోకి రాగానే కేంద్రం ఇచ్చే దాంతో సంబంధం లేకుండా ప్రతీ రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తాం’ అంటూ సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీకి తూట్లు పొడుస్తోంది. తొలి ఏడాది నిస్సిగ్గుగా రూ.20 వేలు ఎగ్గొట్టింది. రెండో ఏడాది అరకొర సాయంతో చేతులు దులుపుకుంటోంది. భూ యజమానులకు రెండు విడతల్లో రూ.5 వేల చొప్పున రూ.10 వేలు అందించిన ప్రభుత్వం.. మూడో విడతగా శుక్రవారం మరో రూ.4 వేలు జమ చేయబోతున్నట్టు ప్రకటించింది. భూ యజమానులకు రెండేళ్లలో రూ.40 వేలకు గాను రూ.26 వేలు ఎగ్గొట్టడమే కాకుండా, కౌలు రైతులకైతే పైసా సాయం చేయకుండా పూర్తిగా మొండి చేయి చూపిస్తూ ఏకంగా రూ.6,400 కోట్లు ఎగ్గొట్టింది.
రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలు రైతులుండగా.. 2024–25లో 9.25 లక్షల మందికి, 2025–26లో 8.24 లక్షల మందికి మాత్రమే సీసీఆర్సీలు (కౌలు రైతు గుర్తింపు కార్డులు) జారీ చేశారు. ఈ లెక్కన చూసినా తొలి ఏడాది 9.25 లక్షల మందికి రూ.20 వేల చొప్పున రూ.1,850 కోట్లు, రెండో ఏడాది 8.24 లక్షల మందికి రూ.1,648 కోట్లు జమ చేయాల్సి ఉండగా, అది కూడా చేయలేదు. మొత్తంగా అన్నదాతలకు రూ.21,273.28 కోట్లు ఎగ్గొట్టింది. మరో వైపు ఐదేళ్ల పాటు పైసా భారం లేకుండా అండగా నిలిచిన ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించి.. సున్నా వడ్డీకి చాప చుట్టేసి.. ఇన్‌పుట్ సబ్సిడీకి ఎగనామం పెట్టింది. విత్తు నుంచి విఫణి వరకు గ్రామ స్థాయిలో రైతులను చేయి పట్టి నడిపించిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసింది. మరో వైపు గత రెండేళ్లలో ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కకపోయినా ఆదుకున్న పాపాన పోలేదు. అయినా సరే నిస్సిగ్గుగా తామేదో రైతులను ఉద్దరిస్తున్నట్టు అన్నదాత సుఖీభవ వారోత్సవాల పేరిట సంబరాలు నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించడం పట్ల రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
7 లక్షల మందికి ఎగనామం
సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున రెండేళ్లలో రూ.40 వేల పెట్టుబడి సాయం అందించాలి. 2023–24లో అర్హత పొందిన 53,58,366 మందికి రూ.20 వేల చొప్పున ఏటా రూ.10,716.73 కోట్లు జమ చేయాలి. కానీ 2024–25 తొలి బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.1,000 కోట్లు కేటాయించినా పైసా ఖర్చు చేయలేదు. అదిగో ఇదిగో అంటూ తొలి ఏడాది నిస్సిగ్గుగా ఎగ్గొట్టేసింది. పాత బకాయిలతో కలిపి 2025–26 బడ్జెట్‌లో రూ.21,433.46 కోట్లు కేటాయింపులు జరపాల్సి ఉండగా, కేవలం రూ.6,300 కోట్లతో సరిపెట్టింది.
గతంలో వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందుగానే పెట్టుబడి సాయం అందించి వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిచేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తొలి ఏడాది ఎగ్గొట్టి, రెండో ఏడాది తనకు నచ్చినప్పుడు రూ.5 వేల చొప్పున 2 విడతల్లో రూ.10 వేలు జమ చేసింది. వాస్తవానికి 2023–24 అర్హుల జాబితా ప్రకారం 53.58 లక్షల మందికి జమ చేయాల్సి ఉండగా, పలు సాకులతో 46.85 లక్షల మందికి కుదించింది. అంటే దాదాపు 7 లక్షల మందికి కోత పెట్టింది. మరో వైపు భూ యజమానులతో పాటు తొలి ఏడాది కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. రెండో ఏడాది వాస్తవ సాగుదారులకు పంగనామాలు పెట్టింది. 
రైతు కూలీలు, కౌలు రైతులను ఆదుకుంటామని ఎన్నికల సమయంలో కృష్ణాజిల్లా పామర్రు, ఉయ్యూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ఇచ్చిన హామీ
మూడో విడతలోనూ కోతలే
⇒ నిజానికి ఏటా భూ యజమానులతో పాటు కౌలుదారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2019–20లో 46.69 లక్షల మందికి లబ్ధి చేకూర్చగా, 2023–24కు వచ్చేసరికి లబ్ధిదారుల సంఖ్య 53.58 లక్షలకు పెరిగింది. ఇలా ఐదేళ్లలో ఈ పథకం కింద రూ.34,288.17 కోట్ల లబ్ధి చేకూరింది. ఆ లెక్కన గడిచిన రెండేళ్లలో లబ్ధిదారుల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గిపోయింది.
⇒ ఆరు దశల వడపోత అనంతరం లబ్ధిదారుల సంఖ్య 46.86 లక్షలకు కుదించారు. పైగా వీరిలో 1.16 లక్షల మంది అటవీ సాగుదారులున్నారు. ఆ లెక్కన వెబ్‌ల్యాండ్ డేటా ప్రకారం తొలి రెండు విడతల్లో లబ్ధి పొందిన భూ యజమానుల సంఖ్య కేవలం 45.70 లక్షల మంది మాత్రమే.
⇒ చనిపోయిన రైతుల స్థానంలో గతంలో వారి వారసులకు పెట్టుబడిసాయం అందించేవారు. కానీ, నేడు ఆ పరిస్థితి లేదు. తొలి విడతలో తామిస్తామన్న రూ.20 వేల చొప్పున రూ.10,716.73 కోట్లు ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. రెండో ఏడాది 46.86 లక్షల మందికి రూ.ఐదు వేల చొప్పున రెండు విడతల్లో రూ.4,685.84 కోట్లు జమ చేసింది. కాగా పీఎం కిసాన్ కింద కేంద్రం జమ చేసే సొమ్ములను కూడా తమ ఖాతాలో వేసుకొని అసెంబ్లీ సాక్షిగా రూ.6,309.44 కోట్లు జమ చేశామని నిస్సిగ్గుగా ప్రకటించుకుంది.
⇒ జగన్ హయాంలో అర్హత ఉండీ లబ్ధి పొందని వారు ఎవరైనా ఉంటే వెతికి వెతికి సాయం అందించేవారు. కానీ నేడు అన్నదాత సుఖీభవ తమకు జమ కాలేదంటూ వేలాది మంది గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. శుక్రవారం నుంచి మూడో విడత పంపిణీ కార్యక్రమంలో రూ.4 వేల చొప్పున రూ.1,874.34 కోట్లు జమ చేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సాయంతో కలిపి 2025–26 సీజన్‌లో రూ.6,560.18 కోట్లు జమ చేసినట్టవుతుంది. వాస్తవానికి రెండేళ్లలో ఒక్కో రైతుకు రూ.40 వేల చొప్పున రూ.21,433.46 కోట్లు జమ చేయాల్సి ఉండగా, ఏకంగా రూ.14,873.28 కోట్లు నిస్సిగ్గుగా ఎగ్గొట్టింది.
సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ప్రతి రైతుకూ ఏడాదికి రూ. 20 వేల ఆర్థిక సాయం అందిస్తామంటూ తెలుగుదేశం కరపత్రిక ఈనాడులో చంద్రబాబు ఇచ్చిన ప్రకటన , తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో వ్యవసాయరంగానికి ఇచ్చిన హామీలు
కౌలు రైతులకు రూ.6,400 కోట్లు ఎగనామం
⇒ భూ యజమానులతో పాటు సామాజిక వర్గాలకు అతీతంగా వాస్తవ సాగుదారులైన కౌలు రైతులతో పాటు దేవదాయ, ధర్మాదాయ భూ సాగుదారులందరికీ ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో ఊరూవాడ విస్తృతంగా ప్రచారం చేసింది. ఆచరణకు వచ్చేసరికి తొలి ఏడాది భూ యజమానులతో పాటు కౌలు రైతులకు ఎగ్గొట్టారు.
⇒ రెండో ఏడాది తొలివిడత సాయం పంపిణీ వేళ.. ఖరీఫ్–2025 సీజన్‌లో పంట నమోదు (ఈ క్రాప్) ప్రామాణికంగా కౌలు రైతుల డేటా ధ్రువీకరణ చేపట్టి, ఆ తర్వాత అర్హత పొందిన వారికి రెండు విడతలు కలిపి జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రెండో విడత సాయం పంపిణీ సమయంలో కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ పూర్తి కావచ్చిందని, త్వరలోనే జమ చేస్తామంటూ వారిని మభ్యపెట్టారు.
⇒ కనీసం చివరి విడతలోనైనా తమకు ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇస్తుందేమోనని రాష్ట్రంలోని కౌలు రైతులందరూ ఆశగా ఎదురు చూశారు. కానీ వారి ఆశలను ఆడియాశలు చేస్తూ వారి నోట్లో మట్టికొట్టారు. దేవదాయ భూ సాగుదారులనూ మోసం చేశారు. సీసీఆర్సీలతో సంబంధం లేకుండా కౌలు సాగుదారులందరికీ పథకాన్ని వర్తింప చేయాలంటే రెండేళ్లలో రూ.6,400 కోట్లు జమ చేయాలి. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నిండా ముంచారు.
అటకెక్కిన ఉచిత పంటల బీమా
⇒ గత ప్రభుత్వ హయాంలో సాగైన ప్రతీ పంటను ఈ క్రాప్‌లో నమోదు చేసేవారు. ఈ క్రాప్ నమోదే ప్రామాణికంగా ఉచిత పంటల బీమా పరిహారంతో పాటు వైపరీత్యాల్లో పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించేవారు. కానీ నేడు ఈ క్రాప్ నిర్వీర్యమైపోయింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమాను అటకెక్కించారు. స్వచ్ఛంద నమోదు బీమా అంటూ రైతుల నోట్లో మట్టికొట్టారు.
⇒ 2023–24 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి రైతుల వాటాతో పాటు ప్రభుత్వ వాటా ప్రీమియం మొత్తం రూ.930 కోట్లు జూన్ 2024లో జమ చేయాల్సి ఉండగా, అదే సమయంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఫలితంగా 2023–24 సీజన్‌కు సంబంధించి రూ.1,324 కోట్ల బీమా పరిహారం రైతులకు అందకుండా మోకాలొడ్డింది.
⇒ ఖరీఫ్ 2024 సీజన్‌లో రైతుల వాటాతో పాటు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.834.44 కోట్లతో పాటు రబీ 2024–25, ఖరీఫ్–2025 సీజన్‌లలో ప్రభుత్వం తమ వాటా కింద చెల్లించాల్సిన రూ.260.67 కోట్లు ఎగ్గొట్టడంతో రబీ 2025–26 సీజన్‌లో ఏపీని కంపెనీలు బ్లాక్ లిస్ట్‌లో పెట్టేశాయి. ఇలా గడిచిన మూడు సీజన్‌లలో రూ.3,500 కోట్లకుపైగా బీమా పరిహారం రైతులకు అందకుండా దగా చేసింది.
⇒ దాదాపు 12 లక్షల మంది రైతులకు రెండేళ్లలో రూ.500 కోట్ల సున్నా వడ్డీ రాయితీని ఎగ్గొట్టారు. వరుస వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న దాదాపు ఆరున్నర లక్షల మందికి రూ.1,000 కోట్లకు పైగా పంట నష్ట పరిహారం (ఇన్‌పుట్ సబ్సిడీ) ఇవ్వకుండా ఎగనామం పెట్టారు.
రెండేళ్లలో రూ.500 కోట్ల సున్నా వడ్డీ రాయితీకి ఎగనామం
ఏ ఒక్క పంటకూ దక్కని మద్దతు ధర
⇒ మద్దతు ధర దక్కని సమయంలో మార్కెట్‌లో జోక్యం చేసుకొని రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ఉద్దేశించిన ధరల స్థిరీకరణ నిధిని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తేసింది. ధాన్యం మొదలు పత్తి, మిరప, పొగాకు, టమాటా, ఉల్లి, మినుము, పెసలు, కంది, శనగ, జొన్న, మొక్కజొన్న, సజ్జ ఇలా ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కకపోయినా ఆదుకోలేదు.
ధరల స్థిరీకరణ నిధికి మంగళం
⇒ వైఎస్ జగన్ హయాంలో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. తద్వారా ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్‌లో జోక్యం చేసుకుని, వ్యాపారుల మధ్య పోటీ పెంచి రైతులకు మద్దతు ధర కల్పించే వారు. ఇలా ఐదేళ్లలో 6.20 లక్షల మంది రైతుల నుంచి రూ.7,577 కోట్ల మేర పంట ఉత్పత్తులు కొనుగోలు చేశారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు.
అప్పుల ఊబిలో రైతులు
⇒ చంద్రబాబు సర్కార్ నిర్వాకంతో 21 నెలల్లో రూ.35 వేల కోట్లకుపైగా రైతులు నష్టపోయారు. ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకుపోయి పెద్ద సంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2024–25లో దాదాపు 150 మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడగా, 2025–26లో 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర పోలీస్ శాఖే అధికారికంగా వెల్లడించింది. రైతులను చేయి పట్టుకుని నడిపించిన ఆర్బీకేలు నిర్వీర్యం
ఇది నమ్మించి మోసం చేయడమే
నాలుగు ఎకరాల ఆలయ మాన్యం భూమిని కౌలుకు సాగు చేస్తున్నాను. డ్రిప్ సహాయంతో వేరుశనగ, టమాటా పంట వేశాను. పంట దిగుబడి రాక, పెట్టుబడులు తలకు మించిన భారమై రెండేళ్లుగా రూ.10 లక్షల వరకు అప్పులయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్క పైసా కూడా సహాయం అందించలేదు. మొదటి ఏడాది ఆశలు వదులుకున్నాం.ఈ ఏడాది అయినా నగదు జమ చేస్తుందని ఆశించిన మాకు ప్రభుత్వం మొండిచేయి చూపింది. కౌలు రైతులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పోయారు. ఇది నమ్మించి మోసం చేయడమే.
– కురుబ రాము, కోనాపురం, ఉరవకొండ మండలం, అనంతపురం జిల్లా
కౌలు రైతులను గుర్తించాలి
కూటమి ప్రభుత్వం వచ్చాక కౌలు రైతుల ఊసే లేకుండా పోయింది. మొదటి ఏడాది అన్నదాత సుఖీభవకు ఎగనామం పెట్టారు. రెండో ఏడాది గడుస్తున్నా కౌలు రైతు గురించి పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. ప్రస్తుతం రబీ సీజన్‌లో సైతం 1.5 ఎకరాల్లో మినుము పంట సాగు చేశా. ఎకరాకు నాలుగు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. అధిక వర్షాలతో పంట సరిగా చేతికందక అప్పులపాలయ్యా. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కౌలు రైతులను గుర్తించి అన్నదాత సుఖీభవ మంజూరు చేయాలి.
– సుబ్బరాయుడు, మీరాపురం, కమలాపురం మండలం, వైఎస్సార్ కడప జిల్లా
కౌలు రైతులకు మొండిచేయి
ప్రతి ఏడాది మూడెకరాల పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాను. ప్రస్తుత ప్రభుత్వంలో కౌలు రైతుల్లో కొందరికే గుర్తింపు కార్డులు ఇచ్చారు. చాలా మందికి ఇవ్వలేదు. గుర్తింపు కార్డులు ఇచ్చిన వారికి కూడా పెట్టుబడి సాయం కింద అందజేసే అన్నదాత సుఖీభవ వర్తింప చేయక పోవడం అన్యాయం. నాలాంటి కౌలు రైతులకు ఒక్క సంక్షేమ పథకం కూడా అందడం లేదు. గత ప్రభుత్వంలో కౌలు రైతులకు సైతం రైతు భరోసా ద్వారా ఆర్థిక సాయం
అందజేశారు.
– పట్టాభయ్య, యానాదివెట్టు, వరదయ్యపాళెం మండలం, తిరుపతి జిల్లా
ధరలేక తెగనమ్ముకున్నా
నాకు రెండు ఎకరాల సొంత భూమి ఉంది. ఏటా రెండు కార్లు వరి పండిస్తున్నాను. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ధాన్యానికి గిట్టుబాటు ధర లభించేది. అప్పట్లో పుట్టి (850 కేజీలు) రూ.22 వేలకు అమ్ముకున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024, 2025లో వేసిన ఎడగారుకు గిట్టుబాటు ధర లభించక పుట్టి రూ.14 వేలు చొప్పున తెగనమ్ముకున్నాను. పుట్టికి రూ.8 వేలు చొప్పున 5 పుట్లకు ఏటా రూ.40 వేలు నష్టపోయాను. రెండేళ్లల్లో నాలుగు పంటలకు రూ.1.60 లక్షలు నష్టపోయాను. రైతులకు గిట్టుబాటు ధర కలి్పంచలేని ఈ ప్రభుత్వాలు ఎందుకు? మేనిఫెస్టోలో ఏం చెప్పారు? అధికారంలోకి వచ్చాక ఏం చేస్తున్నారు?
– గుడిపాటి ప్రభాకర్‌నాయుడు, యనమదల, చేజర్ల మండలం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మద్దతు ధర అడియాశే
చంద్రబాబు కూటమి పాలనలో రైతులకు ఒరిగిందేమీ లేదు. వేలకు వేలు పెట్టుబడులు పెట్టి పంట చేతికొచ్చాక దళారులు, మిల్లర్లు దోచేశారు. గత ఖరీఫ్ సీజన్‌లో మూడెకరాల్లో వరి సాగు చేశాను. వరిలో తేమ శాతం సాకుగా చూపి 75 కిలోలు బస్తాకు రూ.300పైగా దోచేశారు. అండగా నిలవాల్సిన ప్రభుత్వం, అధికారుల్లో చలనం లేదు. రైతు పక్షాన నిలబడలేదు. పండించిన పంటకు మద్దతు ధర దక్కకపోగా దళారులు, మిల్లర్లు మిలాకత్ అయ్యి రైతులను అడ్డంగా దోచుకున్నారు. ఆఖరికి రవాణా వాహనాలు కూడా మేమే చూసుకోవాల్సి వచ్చింది. పేరుకేమో రైతు సంక్షేమ ప్రభుత్వం. వాస్తవంలో మాత్రం రైతు గోడు పట్టించుకోవటం లేదు.
– కొండవీటి వెంకట సుబ్బారావు, మంతెన, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా
చాలా అన్యాయం
నేను నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నాను. కానీ నాకు అన్నదాత సుఖీభవ పథకం రాలేదు. ఇదేమని ప్రశ్నిస్తుంటే అధికారులు సమాధానం చెప్పడం లేదు. కౌలు రైతులకు సైతం అన్నదాత సుఖీభవ పథకం అందిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. కానీ ఇప్పుడు మాకు వర్తించలేదు. వైఎస్సార్‌సీపీ హయాంలో రైతు భరోసా వచ్చేది. ఇప్పుడు ఆగిపోయింది. అసలు కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇస్తారా.. ఇవ్వరా తేల్చి చెప్పండి.
– అమర లింగడు, కాగువాడ గ్రామం, పాతపట్నం మండలం, శ్రీకాకుళం జిల్లా
వడ్డీకి అప్పుతెచ్చి పంటల సాగు
నేను రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి, అపరాల పంటలు సాగు చేస్తున్నాం. జగన్ ప్రభుత్వంలో వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందేది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి సాయం అందలేదు. అన్నదాత సుఖీభవ పథకం సాయం కోసం సచివాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది.
– దివిలి శ్రీను, తోడుగెడ్డ, మెంటాడ మండలం, విజయనగరం జిల్లా
రెండేళ్లుగా ఇన్‌పుట్ సబ్సిడీ ఊసే లేదు
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గరగా రెండేళ్లవుతోంది. ఇప్పటి వరకు రైతులకు అందాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ ఊసే లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇన్‌పుట్ సబ్సిడీ సమయానికి అందేది.
– అనుసూరి గోవిందు, ఉండూరు, రామచంద్రపురం మండలం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
మొత్తంగా రూ.40 వేలు జమ చేయాలి
పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ఇస్తామన్న రూ.20 వేల పెట్టుబడి సాయం కౌలు రైతులకు తొలి ఏడాది ఎలాగూ ఎగ్గొట్టారు. రెండో ఏడాది అయినా ఇస్తారనుకుంటే దగా చేశారు. కనీసం మూడో విడతతో కలిపి అయినా ఇస్తారనుకుంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. గతేడాది ఎగ్గొట్టిన బకాయిలతో పాటు మొత్తంగా రూ.40 వేలు జమ చేయాలి.
– వై.రాధాకృష్ణ, ఎం.హరిబాబు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఏపీ కౌలు రైతుల సంఘం

ఇతని పేరు పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కలవకూరు గ్రామం. ఇతనికి నాలుగు ఎకరాల పొలం ఉంది. కొంత వరి పంట, మరి కొంత మొక్కజొన్న సాగు చేస్తుంటాడు. ప్రకృతి వైపరీత్యాల వల్ల వేసిన పంట నష్టపోయి దిగుబడులు పూర్తిగా తగ్గిపోయాయి. ఎకరాకు 25 బస్తాలు వరి ధాన్యం దిగుబడి వచ్చింది. కొనుగోలు చేసిన నాథుడే లేదు. కూటమి ప్రభుత్వం క్వింటా రూ.1,800కు కొనుగోలు చేస్తుందని చెప్పిందే కానీ ఆ ధరతో కొనలేదు. దీంతో చివరకు రూ.1300కే దళారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. మొక్కజొన్న దిగుబడులు అంతంత మాత్రంగానే వచ్చాయి. మద్దతు ధర క్వింటా రూ.2,300తో ప్రభుత్వం కొనలేదు. దళారులకు రూ.1600కే అమ్ముకున్నాడు. దాంతో అప్పుల పాలయ్యాడు. వర్షాలకు పంట దెబ్బతిన్నా నష్ట పరిహారం ఇంత వరకు అందలేదు.

ఇతని పేరు శేఖర్‌రెడ్డి. నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పి.లింగాపురం గ్రామం. 2025ృ26 ఖరీఫ్ సీజన్‌లో ఎనిమిది ఎకరాల్లో మొక్కజొన్న, నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ప్రస్తుతం రబీ సీజన్‌కు ఎనిమిది ఎకరాల్లో మొక్కజొన్న, 13ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేశాడు. ఖరీఫ్‌లో నాలుగు ఎకరాల్లో సాగుచేసిన పత్తిపంటకు రూ.6 వేల ప్రీమియం చెల్లించి పంటల బీమా చేయించాడు. 2025 ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కురిసిన అధిక వర్షాలతో పత్తిపంట దెబ్బతిని దిగుబడి ఎకరాకు మూడు క్వింటాళ్లే వచ్చింది. పత్తిపంట దెబ్బతిన్న విషయాన్ని రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సిబ్బందికి తెలపటంతో పంట ఫొటోలు తీసుకొని వెళ్లి ప్రభుత్వానికి పంపించారు. ఇప్పటిదాకా ఒక్కరూపాయి కూడా బీమా డబ్బులు మంజూరు చేయలేదు. జగన్ పాలనలో పైసా ప్రీమియం చెల్లించకపోయినా రూ.50 వేల వరకు పంటనష్ట పరిహారం మంజూరైంది.

ఇతని పేరు తామరపల్లి ముసలయ్య. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం అర్జునుడుపాలెం శివారు పెద్దిరెడ్డిపాలెం స్వగ్రామం. 4 ఎకరాలు కౌలుకు తీసుకుని పంట సాగు చేస్తున్నాడు. ఏటా పంట సాగు ఖర్చు రూ.లక్ష వరకు అవుతోంది. గత ప్రభుత్వంలో ఏటా పెట్టుబడి సాయం అందేది. ఈ ప్రభుత్వం వచ్చాక మరింతగా పెట్టుబడి సాయం అందుతుందని ఎదురు చూశాడు. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది అయినా ఇస్తారనుకుంటే రూపాయి కూడా ఇవ్వలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు మూడో విడతలో అయినా సాయం అందుతుందని ఎంతగానో ఆశలు పెట్టుకున్నా, నిరాశే ఎదురైందని నిట్టూరుస్తున్నాడు. ఇలాంటప్పుడు కౌలు రైతుగా గుర్తింపు కార్డు ఇచ్చినా ఏం ఉపయోగం? అని ప్రశ్నిస్తున్నాడు.


