Indore: జనంపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ముగ్గురు మృతి | Indore Accident 3 Killed as Drunk Driver Ploughs Truck | Sakshi
Sakshi News home page

Indore: జనంపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ముగ్గురు మృతి

Sep 16 2025 7:27 AM | Updated on Sep 16 2025 7:32 AM

Indore Accident 3 Killed as Drunk Driver Ploughs Truck

ఇండోర్‌: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇండోర్‌లో మద్యం మత్తులో ట్రక్కును నడిపిన డ్రైవర్‌ వాహనాన్ని జనాలపైకి పోనిచ్చాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు త్రీవంగా గాయపడ్డారు.

ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాల్లలో ఆర్తనాదాలు మిన్నుముట్టాయి. రోడ్డుపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటం, రక్తమోడుతున్న స్థితిలో కొందరు కాపాడాలని అరుస్తుండటం స్థానికుల హృదయాలను కలచివేసింది. ప్రమాదంలో బాధితుల సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చని  అధికారులు చెబుతున్నారు. విమానాశ్రయ రోడ్డులో శిక్షక్ నగర్‌లోని నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించిన ట్రక్కు జనసమూహాన్ని దూసుకుంటూ వెళ్లడంతో పాటు10 వాహనాలను ఢీకొన్నదని పోలీసులు తెలిపారు.

‘డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు. అతను మొదట రామచంద్ర నగర్ కూడలి వద్ద ఇద్దరు బైకర్లను ఢీకొని, వారి వాహనాలను ఈడ్చుకుంటూ వెళ్లి, ఆపై బడా గణపతి ప్రాంతం వైపు నిర్లక్ష్యంగా ట్రక్కును పోనిచ్చాడని డిప్యూటీ పోలీస్ కమిషనర్ కృష్ణ లాల్‌చందాని తెలిపారు. ఆ ట్రక్కు డ్రైవర్‌ను పట్టుకుని, మల్హర్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించామని తెలిపారు. కాగా ప్రమాదం స్థలంలో పలు మృతదేహాలు పడివున్నయని, ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. స్థానికులు ప్రమాదబాధితులను  సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

 

ప్రమాదం అనంతరం ట్రక్కు మంటల్లో చిక్కుకుంది. ఆగ్రహంతో స్థానికులు వాహనాన్ని తగలబెట్టారనే వాదన వినిపిస్తోంది.  అయితే ట్రక్కు ముందుగా ఒక మోటార్ సైకిల్‌ను ఢీకొన్నప్పుడు..  బైక్  ఇంధన ట్యాంక్ పేలి, మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు, పారామెడిక్స్‌తో పాటు అగ్నిమాపక దళ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయి. ఘటన దరిమిలా రెండు మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితులకు వివిధ ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నారు.

‘ఇండోర్‌లో జరిగిన ట్రక్కు ప్రమాదం చాలా విషాదకరం. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్నాక, అదనపు ప్రధాన కార్యదర్శి (హోం)ని ఇండోర్‌కు వెళ్లాలని ఆదేశించాను. రాత్రి 11 గంటలకన్నా ముందుగానే నగరంలోకి భారీ వాహనాలు ప్రవేశించడానికి గల కారణాలు తెలుసుకోవాలని ఆదేశించాను. మృతుల కుటుంబాలకు  సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని అని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన ‘ఎక్స్‌’ పోస్టులో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement