
2014–15తో పోలిస్తే 77% తగ్గిన ప్రమాదాలు
ప్రమాద బాధితులకు రూ. 67 కోట్ల పరిహారం
6,635 రైల్వే స్టేషన్లలో ఎల్రక్టానిక్ ఇంటర్‌లాకింగ్ అమలు
భద్రతపై దృష్టిసారించామన్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
సాక్షి, న్యూఢిల్లీ: భారత రైల్వేల్లో ప్రమాదాల సంఖ్య గత దశాబ్దంలో గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అనేక ఆధునిక సాంకేతిక పద్ధతులు, మౌలిక వసతుల అభివృద్ధి చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఈ ఫలితాలు కనిపిస్తున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ‘‘2014–15 ఏడాదితో పోలిస్తే 2024–25లో ప్రమాదాలు 77 శాతం తగ్గాయి.
2024–25లో కేవలం 31 ప్రమాదా లు సంభవించాయి. 2025–26లో జూన్ చివరివరకు కేవలం 3 ప్రమాదాలు మాత్రమే నమోదయ్యాయి. 2014–15 ఏడాదిలో ప్రతి 10,00,000 కిలోమీటర్ల రైలు ప్రయాణాలకు 0.11 శాతం మాత్రమే ప్రమాదాలు సంభవించాయి. 2024–25లో ఇది మరింతగా తగ్గి 0.03 శాతానికి దిగొచ్చింది. అంటే రైలు ప్రమాదాలు ఏకంగా 73 శాతం తగ్గాయి. 2004–14 కాలంలో 1,711 రైల్వే ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 904 మంది మృతి చెందారు. 3,155 మంది గాయపడ్డారు. 2014–24 కాలంలో 678 ప్రమాదాలు సంభవించాయి. మొత్తంగా 748 మంది మరణించారు. 2,087 గాయపడ్డారు’’అని మంత్రి తెలిపారు.
ప్రమాద బాధితులకు రూ. 67.59 కోట్ల పరిహారం
‘‘2020 నుంచి ఇప్పటివరకు రైలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినవారికి లేదా గాయపడినవారికి రూ. 37 కోట్ల ఎక్స్ గ్రేషియా చెల్లించాం. రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ద్వారా తేలిన పరిహారంగా రూ.30.59 కోట్లు చెల్లించాం. ట్రిబ్యునల్ పరిహారం ఎక్స్‌గ్రేషియాకు అదనం. ఇది న్యాయ ప్రక్రియ ప్రకారం మాత్రమే కల్పిస్తాం’’అని మంత్రి అన్నారు.
భద్రతకు అత్యంత ప్రాధాన్యం
‘‘భద్రతకు అత్యంత ప్రాధాన్యం కల్పించాం. దేశవ్యాప్తంగా 6,635 రైల్వే స్టేషన్లలో ఎల్రక్టానిక్ ఇంటర్‌లాకింగ్ అమలు చేశాం. 2020 ఏడాదిలో కవచ్ వ్యవస్థ ఆమోదం పొందింది. 2025 జూలై 30 నాటికి కోటా–మథురా మా ర్గంలో 324 కిలోమీటర్ల మేర కవచ్‌ను కొత్తగా అమల్లోకి తెచ్చాం. 2014లో 90 మాత్రమే ఉన్న ఫాగ్ సేఫ్టీ డివైజ్‌ల సంఖ్యను 2025 నాటికి 25,939 యంత్రాలకు పెంచాం. 2004–14 కాలంలో కొత్తగా 14,985 కిలోమీటర్ల మేర ట్రాక్‌ను వేశాం. 2014–24 కాలంలో ఇది 34,428 కి.మీకు పెరిగింది. బ్రిడ్జిలు, రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాసుల సంఖ్య 4,148 నుంచి 13,808కి పెరిగింది. ఐసీఎఫ్ కోచ్‌ల స్థానంలో ఆధునిక ఎల్‌హెచ్‌బీ కోచ్‌లకు మార్చాం. అన్ని బ్రాడ్ గేజ్ మార్గాల్లో 2019 నాటికి అన్‌మాన్‌డ్ లెవెల్ క్రాసింగ్‌ల ఇబ్బందులను పూర్తిగా తొలగించాం’’అని రైల్వే మంత్రి స్పష్టం చేశారు.