
రియల్ టైమ్ సమాచారం ఇస్తూ చైనా తోడ్పాటు
ఆయుధాలు పరీక్షించుకోవడానికి పాక్‌ను ప్రయోగశాలగా వాడుకుంది
ఆయుధాలు సరఫరా చేసిన తుర్కియే
భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ రాహుల్ ఆర్.సింగ్ వెల్లడి
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కు దాని మిత్రదేశం చైనా సహకరించిందా? ఇండియాకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు చేరవేసిందా? అంటే అవుననే చెబుతున్నారు భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్.సింగ్. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. మే 7 నుంచి 10వ తేదీ దాకా నాలుగు రోజులపాటు ఆ ఆపరేషన్ కొనసాగింది.
భారత సైన్యం దాడిలో పాకిస్తాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలు, లాండ్‌ప్యాడ్‌లు ధ్వంసమయ్యాయి. అయితే, ఆ సమయంలో పాకిస్తాన్‌కు చైనా సహకరించిందని, ఇండియన్ ఆర్మీ కదలికలకు సంబంధించి రియల్ టైమ్ సమాచారం చేరవేసిందని రాహుల్ ఆర్.సింగ్ తెలియజేశారు. తుర్కియే సైతం పాక్‌కు అండదండలు అందించిందని, కొన్ని రకాల ఆయుధాలు సరఫరా చేసిందని పేర్కొన్నారు.
ఢిల్లీలో శుక్రవారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ‘నూతన తరంలో సైనిక సాంకేతికతలు’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. భా రత సైన్యం దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకి స్తాన్‌కు చైనా, తుర్కియేలు చేతనైనంత సాయం చేశాయని పేర్కొన్నారు. ఆ మూడు దేశాల కుట్రను తాము ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పారు. తెరపైన కనిపించింది పాకిస్తాన్ కాగా, తెరవెనుక చైనా, తుర్కియే ఉన్నాయని వెల్లడించారు.
#WATCH | Delhi: At the event 'New Age Military Technologies' organised by FICCI, Deputy Chief of Army Staff (Capability Development & Sustenance), Lt Gen Rahul R Singh says, "Air defence and how it panned out during the entire operation was important... This time, our population… pic.twitter.com/uF2uXo7yJm
— ANI (@ANI) July 4, 2025
అరువు తెచ్చుకున్న కత్తి
చైనా తన ఆయుధాల సామర్థ్యం పరీక్షించుకోవడానికి పాకిస్తాన్‌ను ప్రయోగశాలగా వాడుకుంటోందని రాహుల్ ఆర్.సింగ్ స్పష్టంచేశారు. ఆ ఆయుధాలను చైనా గడ్డపై నుంచి ఇతర దేశాలపైకి ప్రయోగిస్తోందన్నారు. పాక్‌కు చైనా సహకరించడంలో ఆశ్చర్యం ఏమీ లేదన్నారు. గత ఐదేళ్ల గణాంకాలు చూస్తే పాకిస్తాన్‌కు 81 శాతం మిలటరీ హార్డ్‌వేర్ చైనా నుంచే వచ్చినట్లు స్పష్టమవుతోందని వెల్లడించారు. పాక్ భూభాగం చైనాకు లైవ్ ల్యాబ్‌గా మారినట్లు తేల్చిచెప్పారు. యుద్ధక్షేత్రంలోకి నేరుగా అడుగుపెట్టకుండా ఇండియాపైకి పాకిస్తాన్‌ను ఉసిగొల్పడమే డ్రాగన్ వ్యూహమని రాహుల్ ఆర్.సింగ్ తెలిపారు.
‘అరువు తెచ్చుకున్న శక్తితో శత్రువును చంపడం’ చైనా ప్రాచీన యుద్ధతంత్రంలో భాగమని గుర్తుచేశారు. సరిహద్దుల్లో ఘర్షణ పడడం కంటే పాకిస్తాన్‌ను ముందుపెట్టి భారత్‌కు ఇబ్బందులు సృష్టించడం చైనా ధ్యేయంగా కనిపిస్తోందని చెప్పారు. ఇదిలా ఉండగా, భారత్–పాక్ మధ్య కాల్పుల విరమణ ప్రక్రియ అమల్లోకి వచ్చిన కొద్దిరోజులకే తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని అప్పట్లో వారు నిర్ణయించుకున్నారు. తుర్కియే అందిస్తున్న సహకారానికి షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలియజేశారు.