
సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనేదానిపై ఊహాగానాలకు ఇండియా కూటమి తెర దించింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి(79) పేరును ఖరారు చేసింది. మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ ప్రకటన చేశారు.
జస్టిస్ సుదర్శన్‌రెడ్డి స్వస్థలం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం. వ్యవసాయం కుటుంబంలో జన్మించారీయన. ఉస్మానియా యూనివర్సిటీలో(1971లో) చదివారు. 1993లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005లో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2007 జనవరి 12న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. నాలుగున్నరేళ్లు సుప్రీం కోర్టులో పని చేశారు.
నల్లధనం కేసులపై కేంద్ర ప్రభుత్వ అలసత్వాన్ని విమర్శిస్తూ, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే.. సాల్వా జుడుమ్ (మావోయిస్టులపై చర్యల కోసం గిరిజన యువకులను నియమించడం) చట్టవిరుద్ధమని తీర్పు ఇచ్చారు. 2011 జూలై 8న సుప్రీం కోర్టు జడ్జిగా పదవీ విరమణ చేశారు. రిటైర్డ్ అయ్యాక.. గోవాకు మొట్టమొదటి లోకాయుక్త చైర్మన్‌గా పని చేశారు. 2024 డిసెంబర్‌లో హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ & మీడియేషన్ సెంటర్ (IAMC) శాశ్వత ట్రస్టీగా బాధ్యతలు చేపట్టారు.
ఎన్డీయే కూటమి తరఫున బీజేపీకి చెందిన రాధాకృష్ణన్ పేరు ఖరారైన సంగతి తెలిసిందే. అయితే.. ఇండియా కూటమి తరఫున అభ్యర్థి ఎవరనే దానిపై గత మూడు రోజులుగా ఉత్కంఠ నెలకొంది. తెరపైకి తమిళనాడుకు చెందిన ఇద్దరి పేర్లతో(ఓ రాజకీయ నేత, ఓ పొలిటీషియన్) పాటు గాంధీ మనవడు తుషార్ గాంధీ పేర్లు కూడా వచ్చాయి. చివరకు ఆ ఉత్కంఠకు తెర దించుతూ న్యాయకోవిదుడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఖరారు చేసింది. ఈ నెల 21వ తేదీన ఆయన నామినేషన్ వేయనున్నారు.

జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ప్రొఫైల్..
1946, జూలై 8న రంగారెడ్డి జిల్లా కందుకూరు రెవెన్యూ మండలం ఇబ్రహీంపట్నం తాలూకా ఆకుల మైలారం గ్రామంలో జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. హైదరాబాద్‌లో చదువుకుని.. ఉస్మానియా వర్సిటీ నుంచి న్యాయ విద్య పూర్తి చేశారు. 1971లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది కె.ప్రతాప్‌రెడ్డి చాంబర్‌లో జూనియర్‌గా పనిచేశారు. సిటీ సివిల్ కోర్టు(హైదరాబాద్), ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పలు కేసుల్లో సమర్థవంతమైన వాదనలు వినిపించారు. 1988, ఆగస్టు 8న హైకోర్టులో రెవెన్యూ శాఖ ప్రభుత్వ న్యాయవాది(1988–1990)గా నియమితులయ్యారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా స్వల్పకాలం విధులు నిర్వర్తించారు. ఏవీ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలోని విద్యా సంస్థలకు కార్యదర్శిగా, కరస్పాండెంట్‌గా పనిచేశారు. 1993–94 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1993 జనవరి 8న ఉస్మానియా విశ్వవిద్యాలయం లీగల్ అడ్వైజర్, స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. 1995, మే 2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2005, డిసెంబర్ 5న ప్రధాన న్యాయమూర్తిగా గౌహతి హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2007, జనవరి 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2011, జూలై 8న పదవీ విరమణ పొందారు.