
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీకి దిగిన సీపీ రాధాకృష్ణన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రధాని మోదీ కోరారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ.. సీపీ రాధాకృష్ణన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రతిపక్షాలతో సహా అన్ని పార్టీలకు ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారని తెలిపారు.
ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన సీపీ రాధాకృష్ణన్‌ను ఎన్డీఏ ఎంపీలు, ఫ్లోర్ లీడర్లు స్వాగతించారు. ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధానమంత్రి మోదీ.. సీపీ రాధాకృష్ణన్ పరిచయం చేశారు.
ఎన్టీఏతో పాటు అన్ని పార్టీల ఎంపీలు ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్డీఏ నిర్ణయించిన అభ్యర్థికి ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘ఉపరాష్ట్రపతి ఎన్నికలో తాము రాధాకృష్ణన్‌కు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం. ఇది మన ప్రజాస్వామ్యానికి, మన దేశానికి, రాజ్యసభను నడపడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని’ ప్రధాని మోదీ పేర్కొన్నారు.