
కర్ణాటక: ఎన్నో ఆశలతో మెట్టినింటికి వెళ్లిన యువతి కొన్ని నెలలకే శవమైంది. కన్నవారికి తీరని కడుపు కోత మిగిలింది. వరకట్న వేధింపులను భరించలేక యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్న ఘటన ఉద్రిక్తతను కలిగించింది.
40 తులాల బంగారం ఇచ్చి..
వివరాల మేరకు.. డెంకణీకోట తాలూకా కూటురు గ్రామానికి చెందిన గోపాలప్ప కూతురు గాయత్రితో హోసూరు గోకుల్‌నగర్‌కు చెందిన మురుగేషన్ కొడుకు కదిరేషన్‌తో గత 11 నెలల క్రితం పెళ్లి జరిగింది. మురుగేషన్ హోసూరులోని పారిశ్రామిక శిక్షణా కేంద్రంలో సహాయక ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు. వధువు తల్లిదండ్రులు పెళ్లి సమయంలో 40 తులాల బంగారం, రూ. 6 లక్షల నగదును కట్నంగా అందజేశారు.
ఈ నేపథ్యంలో ఇంకా కట్నం తీసుకురావాలని భర్త ఇంటివారు తీవ్రంగా వేధించడంతో గాయత్రి కొన్నిరోజుల కిందట పుట్టింటికి చేరుకుంది. భర్త ఆమెకు మాయమాటలు చెప్పి బెంగళూరులో కాపురం పెట్టాడు. 13వ తేదీన గాయత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్న రీతిలో శవమై తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని భర్తను అరెస్ట్ చేశారు. తమ కూతురిని బలిగొన్న గోపాల్, అతని కుటుంబంపై కఠిన చర్యలు తీసుకోవాలని గాయత్రి తల్లిదండ్రులు సబ్‌కలెక్టర్ ఆక్రితి శెట్టికి కు వినతిపత్రం అందజేశారు.