మొన్న ప్రేయసి.. నిన్న ప్రియుడు
ప్రేమికుల బలవన్మరణం
ఆరుట్లలో విషాద ఛాయలు
రంగారెడ్డి జిల్లా: వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో.. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో మనస్తాపం చెందిన యువతి ఇంటోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడగా.. ఆమె లేని జీవితం వ్యర్థమని భావించిన యువకుడు.. ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
పెళ్లికి ఒత్తిడి తేవడంతో..
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి ఆరుట్ల గ్రామానికి చెందిన పంబాల నందిని(21), అదే గ్రామానికి చెందిన మంకు నాగరాజు రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాలం గడుస్తున్న కొద్దీ.. ఇదే విషయమై ఆమె అతడిపై ఒత్తిడి తేగా.. అతను నిరాకరిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం మరోసారి ఇద్దరు ఫోన్లో గొడవ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన యువతి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నందిని మృతితో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. తమ కూతురు మృతికి నాగరాజే కారణమని పేర్కొంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు అయింది.
ఆందోళన చెంది..
నందిని చనిపోవడం, ఠాణాలో కేసు నమోదు కావడంతో ఆందోళన చెందిన మహేశ్(26).. అదే రోజు సాయంత్రం ఆగాపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లి, అక్కడే తల దాచుకున్నాడు. మానసికంగా కృంగిపోయి, భయాందోళనకు గురైన అతను.. బుధవారం ఆ గ్రామ శివారులోని చింత చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమించిన యువతి మృతితో మానసిక వేధనకు గురై మహేశ్ బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబీకులకు అప్పగించారు.


