
న్యూఢిల్లీ: దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల వేడి నెలకొంది. త్వరలో జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్షాల ఇండియా కూటమి రాజకీయేతర, పార్టీయేతర అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కోవలో పలువురు ప్రముఖుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ జాబితాలో ఒక శాస్త్రవేత్త, మహాత్మా గాంధీ వారసుడు కూడా ఉన్నారు. వీరిలో ఇస్రో మాజీ శాస్త్రవేత్త ఎం. అన్నాదురై పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. భారతదేశ చంద్రయాన్, మంగళయాన్ మిషన్లలో అన్నాదురై కీలక పాత్ర పోషించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, మహాత్మా గాంధీ ముని మునిమనవడు తుషార్ గాంధీని కూడా ఉప రాష్ట్రపదవికి నామినేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాజకీయేతర వ్యక్తికి మద్దతు ఇవ్వడం ద్వారా, పార్టీ శ్రేణులకు అతీతంగా, విస్తృత ఆమోదం పొందే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. సెప్టెంబర్ 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు అభ్యర్థిని నిర్ణయించేందుకు ప్రతిపక్ష పార్టీలు ఈరోజు(మంగళవారం) మధ్యాహ్నం 12.30 గంటలకు న్యూఢిల్లీలోని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో సమావేశం కానున్నారు. ఈ సమావేశం అనంతరం ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.