అమెరికా సంస్థలో ఆస్ట్రోనాట్ అభ్యర్థిగా కైవల్యరెడ్డి ఎంపిక
నాలుగేళ్లపాటు కఠినమైన ఆస్ట్రోనాట్ తర్ఫీదు
అంతర్జాతీయ నిపుణుల మార్గదర్శకత్వంలో శిక్షణ
నిడదవోలు: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన 17 ఏళ్ల కుంచాల కైవల్యరెడ్డి అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ (టీఎస్‌ఐ) ఆధ్వర్యంలో 2029లో చేపట్టనున్న అంతరిక్ష యాత్రలో పాల్గొనేందుకు ఆస్ట్రోనాట్ అభ్యర్థిగా ఎంపికైంది. ఈ విషయాన్ని టీఎస్‌ఐ సీఈఓ నీల్ ఎస్.లచమన్ గురువారం ఆమెకు తెలిపారు. ఎంతో క్లిష్టమైన ఇంటర్వ్యూ ప్రక్రియ అనంతరం లచమన్, చీఫ్ ఆస్ట్రోనాట్ విలియం మెక్ ఆర్థర్, సీఓఓ అండ్ చీఫ్ ఇంజినీర్ డాక్టర్ వి.విజయ్‌ల బృందం కైవల్యరెడ్డిని ఆస్ట్రోనాట్ అభ్యర్థిగా ఎంపిక చేసింది.
కైవల్యకు టీఎస్‌ఐ నాలుగేళ్ల కఠినమైన ఆస్ట్రోనాట్ శిక్షణను అందించనుంది. మూడు దశాబ్దాల అనుభవంతో 224 రోజులు అంతరిక్షంలో గడిపి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) కమాండర్‌గా ఆరునెలలు సేవలందించిన నాసా వెటరన్ ఆస్ట్రోనాట్, టీఎస్‌ఐ చీఫ్ ఆస్ట్రోనాట్ విలియం బిల్ మెక్ ఆర్థర్‌తో పాటు బ్రెజిల్ తొలి వ్యోమగామి, టీఎస్‌ఐ డిప్యూటీ చీఫ్ ఆస్ట్రోనాట్ మార్కోస్ పోంటెస్, వ్యోమగామి శిక్షకుడు డాక్టర్ వ్లాదిమిర్ ప్లెట్సర్, టీఎస్‌ఐ చీఫ్ ఇంజినీర్ అండ్ సీఓఓ డాక్టర్ వి. విజయ్, మానసిక సంసిద్ధత నిపుణురాలు డాక్టర్ మిండీ హోవార్డ్ వంటి అంతర్జాతీయ నిపుణుల మార్గదర్శకత్వంలో కైవల్యరెడ్డి శిక్షణ పొందనున్నారు.
జీరో గ్రావిటీ పారాబొక్ ఫ్లైట్స్, స్కూబా డైవింగ్, ఈవా డైవింగ్, న్యూట్రల్ బోయన్సీ శిక్షణ, హై–ఆల్టిట్యూడ్ స్కై డైవింగ్, హైకింగ్ వంటి వాటిలో శిక్షణ ఇస్తారు. శిక్షణ తర్వాత అభ్యర్థులు తమ మిషన్ అసైన్‌మెంట్లు అందుకుని, అధునాతన శిక్షణ దశలోకి ప్రవేశించి శాస్త్రీయ ప్రయోగాలు చేస్తారు. కుంచాల శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి దంపతులకు మొదటి సంతానం కైవల్యరెడ్డి. ఇంటర్ పూర్తి చేసుకుని ఆస్ట్రో ఫిజిక్స్‌లో డిగ్రీ చేయనుంది.
కైవల్యరెడ్డి సాధించిన విజయాలు..
» అమెరికాలోని నాసా ఫెసిలిటీతో ఏక్సా వారు అలబామా నిర్వహించే ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం–2023ను పూర్తిచేసిన అతి పిన్న వయసున్న భారతీయురాలు.
» నాసా సిటిజన్ సైంటిస్టుగా మార్స్, జూపిటర్ మధ్య ఉండే మెయిన్ ఆస్టరాయిడ్ బెల్ట్‌లో రెండు ప్రొవిజినల్ ఆస్టరాయిడ్స్ 2020 పీఎస్ 20, 2021 సీఎం37ను కనుగొంది. నాసా నిర్వహించే సైంటిస్ట్ ఫర్ ఎ డే వ్యాసరచన పోటీల్లో 2021లో జాతీయ ఫైనలిస్ట్‌గా నిలిచింది.
» ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ పోటీల్లో 2021, 2025లో సిల్వర్ హానర్ సరి్టఫికెట్లు పొందింది. ఐఎస్‌ఆర్‌ఓ సంస్థ నిర్వహించిన స్పేస్ క్విజ్, సైన్స్ ఫెయిర్, ఆస్ట్రో ఫొటోగ్రఫీ, వక్తృత్వ పోటీల్లో అనేక అవార్డులు సొంతం చేసుకుంది.
» ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అందుకుంది. పీరియాడిక్ టేబుల్ రసాయనిక ఆవర్తన పట్టికను నిమిషం 38 సెకన్లలో వేగంగా అమర్చి ప్రపంచ రికార్డ్ సృష్టించింది.
» వివిధ రకాల ఆర్ట్స్, క్రాఫ్ట్స్ తయారుచేసి ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందింది.
తెలుగు బుక్ ఆఫ్ రికార్స్ 2024లో మల్టీ టాలెంటెడ్ ఇండివిడ్యువల్ ఆఫ్ ద ఇయర్‌గా కైవల్య ఎంపికైంది.
ఖగోళ శాస్త్రవేత్తగా సేవలందిస్తా..
ఆస్ట్రోనాట్ అభ్యర్థిగా ఎంపిక చేసిన టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వ్యోమగామిగా, ఖగోళ శాస్త్రవేత్తగా ఎదిగి దేశానికి సేవలందిస్తాను. – కుంచాల కైవల్యరెడ్డి
శిక్షణ అనంతరం..
» టీఎస్‌ఐ 2029లో తొలి స్పేస్ ప్లేన్ మిషన్‌ను కైవల్య ప్రారంభించనుంది.
» ఇది భూమి చుట్టూ రెండు కక్ష్యలను పూర్తిచేస్తూ 300 కి.మీ. ఎత్తుకు చేరి ఐదు గంటలపాటు సాగుతుంది.
» దీనిలో ఆస్ట్రోనాట్లు మూడు గంటలపాటు పూర్తి జీరో గ్రావిటీలో ఉండాలి.
» అంతరిక్షం నుంచి రెండు సూర్యోదయాలు, రెండు సూర్యాస్తమయాలు వీరు వీక్షిస్తారు.
» ఈ ప్రయాణంలో వ్యోమగాములు మైక్రోగ్రావిటీ ప్రయోగాలు నిర్వహిస్తారు.


