
భారత్ 'అగ్ని 5' బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒడిశాలోని చాందీపుర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఇది అణు సామర్థ్యం ఉన్న స్వదేశీ క్షిపణి. ఇది రక్షణ రంగంలో దేశానికి ఉన్న బలమైన సామర్థ్యాన్ని మరోసారి చాటుకుంది.
ఈ పరీక్షను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) నిర్వహించింది. ఒకేసారి బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం గల 'అగ్ని 5' ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి 5 వేల కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగలదు.
మూడు దశల ఘన ఇంధన ఇంజిన్‌ను కలిగి ఉన్న ఈ క్షిపణి.. ఇది భారత సరిహద్దులను మరింత సురక్షితం చేస్తుంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణిని ‘మల్టీపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్’ సాంకేతికతతో రూపొందించారు. దీనిద్వారా ఒకే క్షిపణి సాయంతో అనేక వార్ హెడ్లను వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించవచ్చు. ఈ ఏడాది జులైలో అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించారు.