2036 నాటికి 23 కోట్ల మంది వృద్ధులు
45 దాటిన వారిని కలిపితే 65 కోట్లు
ఎక్కువ మందికి అప్పులు.. అనారోగ్యాలు
50 ఏళ్ల నుంచే జాగ్రత్త పడాలి : నిపుణులు
మన దేశంలో వృద్ధుల జనాభా 2036 నాటికి 23 కోట్లకు చేరుకోనుంది. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం అప్పుడున్న వృద్ధులకు ఇది రెండింతలకు పైగానే అని ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. భారత జనాభాలో వృద్ధుల వాటా 2011లో ఉన్న 8.6 శాతం నుంచి 2050 నాటికి 19.5 శాతానికి చేరనుంది. అంటే సుమారు 31.9 కోట్లకు పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
ఐదింట ఒకరికే బీమా..
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించిన ‘లాసి’(లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ ఇన్ ఇండియా) నివేదిక ప్రకారం.. భారత్‌లో 60 ఏళ్ల వయసు దాటిన వృద్ధులు 15 కోట్ల మంది ఉన్నారు. వీరిలో ఐదింట ఒకరు మాత్రమే ఆరోగ్య బీమా పరిధిలోకి వస్తున్నారని నివేదిక పేర్కొంది.
పింఛను పైనే ప్రాణాలన్నీ..
45 ఏళ్లు..అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పెద్దలను కూడా వృద్ధుల్లో చేరిస్తే 2050 నాటికి జనాభాలో దాదాపు 40 శాతం మంది.. అంటే 65.5 కోట్ల మంది వృద్ధులు ఉంటారని నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం దాదాపు 70 శాతం మంది వృద్ధులు తమ రోజువారీ అవసరాలకు కుటుంబ సభ్యులపైన, సాధారణ పెన్షన్లపైన ఆధారపడి ఉన్నవారేనని నివేదిక తెలిపింది.
చేయూతగా ప్రభుత్వ పథకాలు..
వృద్ధుల కోసం ప్రభుత్వం కనీసం రూ.1,000 నుంచి రూ.5,000 వరకు నెలవారీ పెన్ష¯ŒŒ కు హామీ ఇచ్చే ‘అటల్ పెన్షన్ యోజన’, వృద్ధుల సాధికారత కోసం ‘అటల్ వయో అభ్యుదయ యోజన’, గ్రాంట్–ఇన్–ఎయిడ్ పథకం, సీనియర్ సిటిజన్స్ కోసం ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్‌ను అమలు చేస్తోంది.
వేల కోట్ల సిల్వర్ ఎకానమీ..
వృద్ధులు వినియోగించే వస్తువులు, పొందే సేవల విలువ ఏడాదికి రూ.73,000 కోట్లుగా ఉన్నట్టు నీతి ఆయోగ్ గత ఏడాది విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. రాబోయే సంవత్సరాల్లో ఈ మొత్తం మరెన్నో రెట్లు పెరుగుతుందని అంచనా వేసింది. ఆర్థిక పరిభాషలో దీనిని ‘సిల్వర్ ఎకానమీ’అంటున్నారు.
మరిన్ని పథకాలు అవసరం..
60 ఏళ్ల వయసులో ఆదాయం ఆగిపోతుంది. చాలామంది నిరాడంబరమైన జీవనశైలికి మారటానికి ఇబ్బంది పడుతుంటారు. ఇలా కాకుండా ఉండాలంటే 50 ఏళ్ల వయసు నుంచే ఆర్థికంగా జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వాలూ వృద్ధుల ఆరోగ్యం, సంక్షేమానికి మరిన్ని పథకాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని స్వచ్ఛంద సేవా సంస్థలు కోరుతున్నాయి.
అనారోగ్యాలతో సహజీవనం
దాదాపు 75 శాతం మంది వృద్ధులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దీర్ఘకాలిక అనారోగ్యాలతో జీవిస్తున్నారు. 40 శాతం మంది కనీసం ఒక వైకల్యంతో బాధపడుతున్నారు. పట్టణాల్లోని వృద్ధుల్లో మధుమేహం అత్యంత సాధారణ దీర్ఘకాలిక సమస్యగా ఉంది. దాదాపు 20 శాతం మంది నిరాశ, నిస్పృహ, డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.
వృద్ధుల కోసం వినూత్నంగా..
ఇండియాలో పెరుగుతున్న వృద్ధుల జనాభా అవసరాలకు అనుగుణంగా కొన్ని కంపెనీలు వినూత్నమైన ఉత్పత్తులు, సేవలను ప్రవేశపెడుతున్నాయి. ఐటీసీ స్నాక్ ఫుడ్స్ ‘కంట్రోల్ + ఆల్ట్ + డిలీట్’అనే క్రియేటివ్ ఫార్ములాతో వృద్ధుల కోసం ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. కొవ్వులు, సోడియం వంటి మూలకాలను ‘కంట్రోల్’చేసి, చక్కెరకు బదులుగా బెల్లం వాడటం వంటి ఆల్టర్నేటివ్‌లను (ఆల్ట్) ఉపయోగించి, కృత్రిమ రంగులను, రుచులనీ ‘డిలీట్’చేయటమే ఈ ఫార్ములా.


