
ప్రధాని మోదీ కౌగిలింతలు బ్యాక్‌ఫైర్
దౌత్యపరంగా దేశం ఒంటరిదైంది
దేశ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆగ్రహం
పట్నా: నరేంద్ర మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం అత్యంత దారుణంగా విఫలమైందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ఆరోపించింది. విదేశాల అధినేతలకు ప్రధాని మోదీ ఇచ్చిన కౌగిలింతలు మనకే ఎదురు తిరుగుతున్నాయని(బ్యాక్‌ఫైర్) మండిపడింది. మోదీ నిర్వాకాల వల్ల విదేశాంగ విధానం కుప్పకూలిందని, దౌత్యపరంగా మన దేశం ఒంటరిగా మారిపోయిందని ఆందోళన వ్యక్తంచేసింది. దేశ ప్రయోజనాలను మోదీ ప్రభుత్వం కాపాడలేకపోతోందని విమర్శించింది.
మరోవైపు ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని, కోట్లాది మంది పేదరికంలోకి జారుకుంటున్నారని, ప్రభుత్వం అంకెల గారడీతో ప్రజలను మభ్యపెడుతోందని ఆగ్రహం వ్యక్తంచేసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో బుధవారం బిహార్ రాజధాని పట్నాలో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించారు. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాం«దీ, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, జైరామ్ రమేశ్, సచిన్ పైలట్ తదితరులు పాల్గొన్నారు.
ఈ భేటీలో పలు తీర్మానాలు ఆమోదించారు. స్వాతంత్య్రం తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు మన దేశ ప్రయోజనాలు కాపాడేందుకు కృషి చేశాయని సీడబ్ల్యూసీ వెల్లడించింది. నరేంద్ర మోదీ మాత్రం మతిలేని చర్యలతో దేశ ప్రయోజనాలను బలి చేస్తున్నారని ఒక తీర్మానంలో ఆక్షేపించింది. ఒకవైపు అమెరికాను బుజ్జగిస్తూ, మరోవైపు చైనాకు దగ్గరవుతూ ఒక స్పష్టమైన విధానం లేకుండా గుడ్డిగా ముందుకెళ్తున్నారని తప్పుపట్టింది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్–పాక్ యుద్ధాన్ని తానే ఆపేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెబుతున్నా మోదీ ప్రభుత్వం నిజాయితీగా ఖండించడం లేదని పేర్కొంది. భారత ఉత్పత్తులపై ట్రంప్ భారీగా టారిఫ్‌లు విధించడంతో మన పరిశ్రమలు మూతపడుతున్నాయని, లక్షల మంది ఉపాధి కోల్పోతున్నారని గుర్తుచేసింది. అమెరికా నుంచి భారతీయులను అవమానకర రీతిలో బయటకు తరిమేసినా మోదీ స్పందించలేదని విమర్శించింది.
రాజ్యాంగంపై బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్ దాడి
దేశ ఆర్థికవ్యవస్థ అద్భుతంగా ఉందని చెప్పుకోవడానికి మోదీ ప్రభుత్వం తంటాలు పడుతున్నట్లు సీడబ్ల్యూసీ విమర్శించింది. గణాంకాలను తారుమారు చేసినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోతాయా? అని ప్రశ్నించింది. ఎన్డీయే మినహా ఇతర పారీ్టలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతున్నట్లు ఆరోపించింది. జీఎస్టీ పరిహారం ఇవ్వకుండా నిలిపివేసిందని వెల్లడించింది. రాజ్యాంగంపై బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్ దాడి చేస్తున్నాయని, ప్రజాస్వామ్యంలో కీలకమైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయాన్ని క్రమంగా ధ్వంసం చేస్తున్నాయని ఆక్షేపించింది.
అవినీతి, నేరాలే రెండు ఇంజిన్లు బిహార్‌లో బీజేపీ చెబుతున్న డబుల్ ఇంజిన్ ప్రభుత్వ అసలు రంగు ప్రజలకు తెలిసిపోయిందని సీడబ్ల్యూసీ వెల్లడించింది. అవినీతి, నేరాలే ఆ రెండు ఇంజిన్లు అని ఎద్దేవా చేసింది. రాష్ట్రంలో ఎన్డీయే సర్కార్ ‘నోటు చోరీ’కి పాల్పడుతోందని, జనం సొమ్ము విచ్చలవిడిగా దోచుకుంటోందని ఆరోపించింది. బిహార్‌ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తుచేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచి్చంది.
రెండు తీర్మానాలు
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రెండు తీర్మానాలు ఆమోదించారు. ఒక రాజకీయ తీర్మానం కాగా, మరొకటి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని ఓటర్లను కోరుతూ మరో తీర్మానం చేశారు. ఓట్ల చోరీతోపాటు ఓటర్ల జాబితాల్లో జరుగుతున్న అవకతవకలను రాజకీయ తీర్మానంలో ప్రస్తావించారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న రాహుల్ గాంధీని ప్రశంసించారు. ఓట్ల చోరీ అంటే రాజ్యాంగంపై, ఆర్థిక వ్యవస్థపై, సామాజిక న్యాయంపై, దేశ భద్రతపై దాడేనని ఉద్ఘాటించారు.
గాజాపై మౌనం సిగ్గుచేటు
గాజాలో జరుగుతున్న మారణహోమం పట్ల మోదీ ప్రభుత్వం మౌనం వహిస్తూ ప్రేక్షక పాత్రకే పరిమితం కావడం సిగ్గుచేటు అని సీడబ్ల్యూసీ మండిపడింది. సాధారణ పాలస్తీనా ప్రజలపై కొనసాగుతున్న దాడులు, మరణాలపై ఆందోళన వ్యక్తం చేసింది.