
న్యూఢిల్లీ, సాక్షి: మహాభారతంలో శ్రీకృష్ణుడి స్పూర్తితో ఎలాంటి ముప్పునుంచైనా దేశాన్ని రక్షించేందుకు వీలుగా మిషన్ సుదర్శన్ చక్రను అనే ఆధునిక ఆయుధ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా 103 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో .. రాబోయే పదేళ్లలో అంటే 2035 నాటికి, దేశ భద్రత కోసం రక్షణా కవచాన్ని అందుబాటులోకి తేనున్నాం. అందుకే శ్రీకృష్ణుడి స్పూర్తితో సుదర్శన చక్ర మార్గాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు.
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు సుదర్శన్ చక్ర ఆయుధ వ్యవస్థ 2035 నాటికి అభివృద్ధి అవుతుంది. మిషన్ సుదర్శన్ చక్ర దేశ రక్షణలో కీలక పాత్ర పోషించనుంది. రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు ప్రార్ధనా స్థలాలు సహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కీలక ప్రదేశాలను సురక్షితంగా ఉంచేలా మిషన్ సుదర్శన చక్ర కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు.
ఈ మిషన్‌లో ఖచ్చితమైన లక్ష్య వ్యవస్థ, అత్యాధునిక ఆయుధాలు ఉంటాయని, ఇది శత్రువుల దాడిని అడ్డుకునేందుకు.. సుదర్శన్ చక్రం వలె శక్తివంతమైన ప్రతీకార దాడుల్ని తిప్పికొడుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కాగా, గత పదేళ్లలో అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారత్ .. పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణి, డ్రోన్ దాడులను నిలువరించిన ఆపరేషన్ సిందూర్ గురించి ఆయన ప్రస్తావించారు.