యూఏఈ అణు ప్లాంట్‌పై దాడి.. భారత్ ఖండన | India Condemns Drone Attack On Barakah Nuclear Facility In UAE Amid Escalating Middle East Tensions, More Details Inside | Sakshi
Sakshi News home page

యూఏఈ అణు ప్లాంట్‌పై దాడి.. భారత్ ఖండన

May 18 2026 11:21 AM | Updated on May 28 2026 11:43 AM

India condemns drone attack on Barakah nuclear facility in UAE

అబూదాబీ: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని అత్యంత కీలకమైన ‘బరాకా అణు విద్యుత్ కేంద్రం’ లక్ష్యంగా  మే 17న జరిగిన డ్రోన్ దాడి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘాతుకాన్ని తీవ్రంగా ఖండించిన భారతదేశం, ఇది ప్రాంతీయ శాంతికి ముప్పు తెచ్చే ఒక ప్రమాదకరమైన చర్య అని  అభివర్ణించింది. అబూదాబీలోని అల్ దఫ్రా ప్రాంతంలో ఉన్న ఈ అణు ప్లాంట్ వెలుపలి సరిహద్దుల్లో డ్రోన్ దాడి కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఉగ్రదాడిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ)సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

అణు ప్లాంట్‌పై దాడి.. భారత్ తీవ్ర స్పందన
యూఏఈలోని ఏకైక అణుశక్తి కేంద్రమైన బరాకాపై జరిగిన ఈ దాడిని భారత్  ఖండించింది. ఇలాంటి చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని పక్షాలూ తక్షణమే సంయమనం పాటించాలని, హింసను వీడి చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్ అత్యవసర పిలుపునిచ్చింది. ఈ దాడి గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.

సురక్షితంగా అణు కేంద్రం.. తప్పిన ముప్పు
డ్రోన్ దాడి కారణంగా బరాకా అణు ప్లాంట్ వెలుపలి ప్రాంగణంలో మంటలు వ్యాపించినప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అబూదాబీ మీడియా కార్యాలయం తెలిపింది. అత్యవసర సహాయక బృందాలు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదం వల్ల ప్లాంట్‌లోని అణు వికిరణాల (రేడియేషన్) భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని అధికారులు ధృవీకరించారు. ముందస్తు జాగ్రత్తగా అన్ని భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్లు యూఏఈ వెల్లడించింది.

ఇరాన్ వైపే అనుమానాలు
ఈ వైమానిక దాడికి తామే బాధ్యులమంటూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు. అయితే, అమెరికా-ఇరాన్ మధ్య నడుస్తున్న తీవ్ర ఘర్షణల నేపథ్యంలో, ఈ దాడి వెనుక ఇరాన్ హస్తం ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఫిబ్రవరి 28 నుంచి గల్ఫ్ రీజియన్‌లో సాగుతున్న ఉద్రిక్తతల క్రమంలో, యూఏఈ ఇంధన, ఆర్థిక వనరులపై జరుగుతున్న డ్రోన్ దాడులకు ఇరానే కారణమని స్థానిక నివేదికలు చెబుతున్నాయి. 2020లో ప్రారంభమైన ఈ బరాకా అణు ప్లాంట్.. యూఏఈ మొత్తం విద్యుత్ అవసరాలలో నాలుగో వంతును తీరుస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement