
వలస విధానాలు కఠినతరం చేస్తున్న అనేక దేశాలు
భారతీయుల విదేశీ ఉద్యోగావకాశాలపై ప్రభావం
మనవాళ్ల ఆదాయం ఎక్కువ ఉండటమూ కారణమే
స్థానికుల్లో అసంతృప్తి చల్లబరిచేందుకు ప్రయత్నాలు
హెచ్–1బీ వీసా దరఖాస్తు రుసుమును భారీగా పెంచుతూ అమెరికా తీసుకున్న నిర్ణయం ముఖ్యంగా భారతీయులను షాక్‌కు గురి చేసింది. ఒక్క యూఎస్ మాత్రమే కాదు.. భారతీయులు సంప్రదాయకంగా ఉద్యోగాల కోసం తరలివెళ్లే అనేక పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి అవరోధాలు ఉన్నాయి. ఈ దేశాలు చరిత్రాత్మకంగా నిపుణుల కొరతను పూడ్చుకోవడానికి, ఆర్థిక వృద్ధిని నడిపించడానికి భారత్, చైనా వంటి దేశాలపై ఆధారపడి ఉన్నాయి.
అయితే ఇటీవలి కాలంలో ఆయా పాశ్చాత్య దేశాల్లోని ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చింది. విదేశీ కార్మికుల కంటే సొంత పౌరులకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నైపుణ్యం కల విదేశీ కార్మికులను ప్రోత్సహించకుండా ఉండటానికి తమ వలస విధానాలకు అనుగుణంగా ఆయా దేశాలు మార్పులు చేసుకుంటున్నాయి. అదే సమయంలో అక్రమ, తక్కువ నైపుణ్యమున్న కార్మికులను నిలువరిస్తున్నాయి.
మనవాళ్ల ఆదాయం ఎక్కువ
కొన్ని ప్రధాన దేశాల్లో నివసిస్తున్న భారతీయుల ఆదాయం స్థానికుల ఆదాయం కంటే అధికంగా ఉంటోంది. తమ దేశంలో ఉంటూ తమ కంటే ఎక్కువ ఆర్జించడం ఆయా దేశాల స్థానికులకు, ముఖ్యంగా యువతకు మింగుడు పడడం లేదన్నది నిపుణుల మాట. యూఎస్ సిటిజన్స్ తో పోలిస్తే.. అక్కడ ఉంటున్న భారతీయుల ఆదాయం రెండింతలకుపైగా ఉంది. ఆస్ట్రేలియా, జర్మనీల విషయంలో ఇది సుమారు 50 శాతం ఎక్కువ. భారతీయుల వల్ల తమ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయనే కోపం ఒకవైపు.. తమకంటే ఎక్కువ సంపాదిస్తున్నారన్న అసూయ మరోవైపు.. వెరసి ఆస్ట్రేలియా, యూకే వంటి అనేక దేశాల్లో స్థానిక యువత అక్కడున్న భారతీయులపై దాడులు చేస్తున్నారు. ‘గో బ్యాక్ టు ఇండియా’ అంటూ బహిరంగంగానే మనవాళ్లను హెచ్చరిస్తున్న సంఘటనలు సైతం పెరుగుతూనే ఉన్నాయి.
వలసలు తగ్గించాలని..
గడిచిన రెండు సంవత్సరాలలో వలసలను తగ్గించేందుకు పాశ్చాత్య దేశాలు అనేక నిర్ణయాలు తీసుకున్నాయి.
యూఎస్: కొత్త హెచ్–1బీ వీసా దరఖాస్తుకు 1,00,000 డాలర్ల వన్–టైమ్ ఫీజు అమలులోకి తెచ్చింది.
యూకే: వర్క్ పర్మిట్ కోసం కనీస వేతన పరిమితిని 38,700 పౌండ్స్ నుంచి 2025 జూలైలో 41,700 పౌండ్స్‌కు పెంచింది.
స్వీడన్: వర్క్ పర్మిట్ కోసం కనీస జీతం పరిమితి 2023 అక్టోబర్ నుంచి రెండింతలకుపైగా అధికమై 29,680 క్రోనర్లకు (ఆ దేశ కరెన్సీ. ఒక క్రోనా సుమారు రూ.9.37) చేరింది.
కెనడా: 2025లో విద్యార్థులు, కార్మికుల దరఖాస్తుల అనుమతిని 10–16% తగ్గించాలన్నది ప్రణాళిక.
ఆస్ట్రేలియా: 2025 నాటికి నికర వలసలను సగానికి తగ్గించే ప్రయత్నంలో భాగంగా 2023–24లో విద్యార్థి వీసాల జారీని 34% తగ్గించారు.