ముస్లింలపై ఎందుకింత ద్వేషం?  | Hyderabad MP Asaduddin Owaisi Slams Waqf Bill 2025, He Tears Waqf Bill During Debate And Calls It An Insult To Muslims | Sakshi
Sakshi News home page

Waqf Bill In Parliament: ముస్లింలపై ఎందుకింత ద్వేషం? 

Apr 3 2025 5:33 AM | Updated on Apr 3 2025 12:02 PM

Hyderabad MP Asaduddin Owaisi Slams Waqf Bill 2025

వక్ఫ్‌ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం 

హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ధ్వజం 

తాను సూచించిన 10 సవరణలు అంగీకరించాలని వినతి  

సాక్షి, న్యూఢిల్లీ:  కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్‌(సవరణ) బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఆరోపించారు. ఈ బిల్లును తాను అంగీకరించబోనంటూ లోక్‌సభలో బిల్లు ప్రతిని ఆయన చించేశారు. దేశంలో మసీదు, ఆలయం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. ఆయన బుధవారం లోక్‌సభలో బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడారు.

 కేంద్రం పచ్చి అబద్ధాలు చెబుతోందని, ఈ బిల్లుతో ముస్లింలకు ఎలాంటి న్యాయం జరుగుతుందని తేల్చిచెప్పారు. రాత్రికి రాత్రి వక్ఫ్‌ భూములను ఆక్రమించుకున్న వారంతా వక్ఫ్‌(సవరణ) బిల్లుతో యజమానులుగా మారిపోతారని ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేం తమాషా? అని ప్రశ్నించారు. ముస్లింలపై ఎందుకింత ద్వేషం? అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. వక్ఫ్‌ బోర్డు అనేది పూర్తిగా ధార్మిక సంస్థ అని స్పష్టంచేశారు. వక్ఫ్‌ బిల్లు విషయంలో తాను సూచించిన 10 సవరణలు అంగీకరించాలని కోరారు.  

ప్రాచీన మందిరాలకే న్యాయం జరుగుతుంది  
‘‘ఆర్టికల్‌ 14 ప్రకారం హిందూ, సిక్కు, జైన, బౌద్ధ ధర్మాలకు చెందిన వారికి సంబంధిత ఎండోమెంట్‌లోని ప్రోత్సాహకాలు వారికే దక్కాలి. పాలనా యంత్రాంగం మొత్తం వారి ఆధీనంలోనే ఉంటుంది. వారి పాలనా యంత్రాంగంలో వేరే ధర్మానికి చెందిన వారికి అవకాశం ఉండదు. వక్ఫ్‌ బోర్డుకు ఉన్న అధికారాలను నూతన వక్ఫ్‌ బిల్లు ద్వారా తొలగించారు. ముస్లిమేతరులు వక్ఫ్‌ బోర్డు పాలనా యంత్రాంగంలో భాగం అవుతారు. ఇది ఆర్టికల్‌ 14ను ఉల్లంఘించడమే అవుతుంది. ఆర్టికల్‌ 25, ఆర్టికల్‌ 26ను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. 

2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత వక్ఫ్‌ ఆస్తులు(అనధికార ఆక్రమణదారుల తొలగింపు) బిల్లు–2014ను ప్రవేశపెట్టి 2024లో ఎందుకు ఉపసంహరించుకున్నారు? అనధికార ఆక్రమణలు జరుగుతున్నాయని భావించినప్పుడు ఆ బిల్లును ఎందుకు వెనక్కి తీసుకున్నారో చెప్పాలి. నూతన చట్టం ప్రకారం.. వివాదాస్పద భూముల్లో మసీదులు ఉన్నచోట ఇది ప్రభుత్వ భూమి అని అధికారి నిర్ణయించి ఒక నోటీసు అతికిస్తే అక్కడ మసీదు మూతబడి అది ప్రభుత్వ భూమిగా మారిపోతుంది. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత దేశంలోని ప్రాచీన మందిరాలకు న్యాయం జరుగుతుంది తప్ప ప్రాచీన మసీదులకు కాదు. ప్రస్తుతం ఢిల్లీలో 172 వక్ఫ్‌ ఆస్తులు దేశ పురావస్తు శాఖ ఆ«దీనంలో ఉన్నాయి. వాటికి సంబంధించిన పత్రాలు లేని కారణంగా ఇప్పుడు అవి ఇక ప్రభుత్వ భూములుగా మారిపోతాయి’’ అని అసదుద్దీన్‌ ఓవైసీ ఆందోళన వ్యక్తంచేశారు.   ­
 

Advertisement
 
Advertisement
Advertisement