
కినౌర్ కైలాస్‌యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
యాత్రమార్గంలో చిక్కుకున్న 413 మందిని కాపాడిన బలగాలు
షిమ్లా: ఉత్తరాఖండ్‌తోపాటు పొరుగున ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌నూ వరదలు ముంచెత్తి యాత్రికులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. తాజాగా హిమాచల్‌లోని కినౌర్ కైలాస్ యాత్రా మార్గంలో కుండపోత వానల కారణంగా ట్రెక్కింగ్ మార్గాల్లో వందలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. వెంటనే విషయం తెల్సుకున్న ఇండో టిబెటన్ బోర్డర్‌పోలీస్(ఐటీబీపీ), జాతీయ విపత్తు స్పందన(ఎన్‌డీఆర్‌ఎఫ్) బలగాలు హుటాహుటిన రంగంలోకి దికి 413 మంది యాత్రికులను కాపాడాయి. పర్వతసానువుల గుండా వర్షపు నీటి ప్రవాహం భీకరంగా దూసుకొస్తోంది. దీంతో ట్రెక్కింగ్ మార్గమధ్యంలోని తాత్కాలిక తాంగ్లిప్పి, కాంగరాంగ్ వంతెనలు ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోవడంతో యాత్రికులు అక్కడ చిక్కుకుపోయారు.
ట్రెక్కింగ్ మార్గం యాత్రకు అనువుగా లేకపోవడంతో కినౌర్ కైలాస్‌యాత్రను తాత్కాలికంగా నిలుపుదలచేస్తున్నట్లు కినౌర్ జిల్లా యంత్రాంగం బుధవారం ప్రకటించింది. టెక్కింగ్ చేస్తూ వెళ్లాల్సిన చాలా చోట్ల బురదపేరుకుపోయి జారే ప్రమాదం పెరిగింది. మిల్లింగ్ ఖాటా, గుఫా ప్రాంతాల్లో కొందరు యాత్రికులు సేదతీరుతున్నారు. వాళ్లకు కనీస సదుపాయాలను ఆర్మీ కల్పిస్తోంది. సముద్ర మట్టానికి 19,850 అడుగుల ఎత్తులో ఉండే కినౌర్ కైలాస్ ప్రాంతాన్ని శివునికి శీతాకాల విడిదిగా చెబుతారు. జూలై 15న ప్రారంభమైన ఈ యాత్ర ఈనెల 30వ తేదీన ముగుస్తుంది. కినౌర్ జిల్లాతోపాటు హిమాచల్‌లోని చాలా ప్రాంతాలు బుధవారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో నాలుగు జాతీయరహదారులు సహా 617 రోడ్లను మూసేశారు. విద్యాసంస్థలకు ఒకరోజు సెలవు ప్రకటించారు.