
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తుండటం తెల్సిందే. మండి జిల్లాలోని థునాగ్ పట్టణంలోని రాష్ట్ర సహకార బ్యాంకు కార్యాలయంలోకి వరద నీరు చేరింది. రెండంతస్తుల ఈ భవనం మొదటి అంతస్తు వరద, చెత్తాచెదారంతో నిండిపోయింది. వరద తీవ్రతకు బ్యాంకు షట్టర్ ఒకటి ఊడిపోగా మరో రెండు షట్టర్లు వంకర్లు తిరిగి ఊడిపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. బ్యాంకులో ఖాతాదార్లు తాకట్టు పెట్టిన, లాకర్లలో భద్రంగా ఉంటుందని భావించిన లక్షలాది రూపాయల విలువైన నగలు, విలువైన పత్రాలు, కోట్లాది రూపా యల డబ్బు ఉన్నట్లు సమాచారం. అయితే, నష్టం వివరాలు వెల్లడి కాలేదు.
చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించిన తర్వాతే నష్టాన్ని అంచనా వేసేందుకు వీలుంటుందని చెబుతున్నారు. థునాగ్ మార్కెట్ ప్రాంతంలో ఉన్న ఈ బ్యాంకులో నిత్యం 150 మంది వరకు వ్యాపా రులు లావాదేవీలు జరుపుతుంటారు. ఎనిమిదివేల జనాభా కలిగిన థునాగ్ పట్టణంలో బ్యాంకు ఇదొక్కటే. వరదల కారణంగా కొట్టుకువచ్చిన విలువైన వస్తువులను ఎవరైనా ఎత్తుకుపోయే ప్రమాదము ందని భావిస్తున్న స్థానికులు నిత్యం కాపలా కాస్తున్నారు. జూన్ 20–జూలై 6వ తేదీల మధ్య హిమాచల్‌లో భారీ వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది.