కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో భేటీ అనంతరం కిషన్‌రెడ్డి వెల్లడి... పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని వినతి
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్న వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ స్కీమ్ (గ్రామీణ్) (వీబీ జీ రామ్‌జీ) పథకాన్ని సజావుగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి రూ.3,825.31 కోట్ల నిధులను కేటాయించినట్లు తెలిపారు.
గురువారం ఆయన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ అయి పథకం అమలు, రాష్ట్రానికి అందాల్సిన సహకారం తదితర విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ గ్రామీణ ప్రజల కోసం 8.50 కోట్ల పనిదినాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, జూన్ 9 నాటికి ఇందులో 4.38 కోట్ల పనిదినాలు పూర్తవగా, రూ.1,163.64 కోట్ల నిధులను ఖర్చు చేసి 11,684 పనులను పూర్తి చేసినట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపినట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు.
60:40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఖర్చు చేయనున్న ఈ పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నోటిఫికేషన్‌ను విడుదల చేయాల్సి ఉందని, దీంతోపాటే రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను కూడా కేటాయించాల్సి ఉందని కిషన్‌రెడ్డి తెలియజేశారు. వ్యవసాయ పనుల విరామానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా వ్యవసాయదారులందరికీ ఆమోదయోగ్యంగా నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందన్నారు. జీ రామ్ జీ పథకాన్ని రాష్ట్రంలో అనుకున్న సమయానికి సజావుగా, సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సమీక్షలు జరుపుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.


