
న్యూఢిల్లీ: పహల్గాం పాశవిక ఉగ్రదాడికి ప్రతిస్పందనగా లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్ర స్థావరాలను భారత్ మే 7వ తేదీ అర్ధరాత్రి తర్వాత దాడిచేయడం తెల్సిందే. పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్ గడ్డపై జరిపిన ఈ క్షిపణి దాడుల్లో తొమ్మిది కీలకమైన ఉగ్ర స్థావరాలు నేలమట్టమై కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్రం గతంలో ప్రకటించింది.
అయితే ఈ దాడుల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులైన ఐదుగురు సైతం చనిపోయినట్లు కేంద్రం సంబంధిత వివరాలను శనివారం వెల్లడించింది. జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ ఇద్దరు బావమరుదులతో పాటు లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో కీలక ఉగ్రవాది, మరో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టినట్లు భారత అధికారులు ప్రకటించారు.
ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీ సీనియర్ ఉన్నతాధికారులు, పోలీసులు సిబ్బంది హాజరయ్యారు. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సు మహిళా ముఖ్యమంత్రి మర్యం నవాజ్ తరఫున అధికారులు పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించిన ఫొటోలు మీడియాలో దర్శనమిచ్చాయి. దీంతో ఉగ్రసంస్థలతో పాక్ ప్రభుత్వ చెలిమి మరోసారి బహిరంగంగా బట్టబయలైంది. ఆ ఐదుగురు మోస్ట్
వాంటెడ్ ఉగ్రవాదుల గురించి క్లుప్తంగా..
మొహమ్మద్ యూసుఫ్ అజార్
భారతసర్కార్ గతంలో తయారుచేసిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో 21వ నంబర్‌గా మొహమ్మద్ యూసుఫ్ అజార్ పేరు ఉంది. దాదాపు 50 ఏళ్లకుపైబడిన వయస్సుండే ఇతను జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు బావమరిది. 1999 డిసెంబర్‌లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఐసీ–814 విమానం హైజాక్ ఉదంతంలో ఇతను కీలక సూత్రధారి. 1998లో అబ్దుల్ లతీఫ్ అనే వ్యక్తిద్వారా తప్పుడు పాస్‌పోర్ట్‌తో భారత్‌లోకి వచ్చాడు. జైషేకు చెందిన బహావల్పూర్ ప్రధాన స్థావరంలో కొత్త ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే బాధ్యతలను యూసుఫ్ చూసుకునేవాడు. యూసుఫ్ కుటుంబం సైతం అదే స్థావరప్రాంగణంలో నివసిస్తోంది.
ఇతనికి ఉస్తాద్ జీ, మొహమ్మద్ సలీమ్, ఘోసీ సాహెబ్ వంటి మారు పేర్లు ఉన్నాయి. ఆయుధాలను ఎలా వాడాలో యువతకు శిక్షణ ఇస్తాడు. జమ్మూకశ్మీర్‌లో పలు ఉగ్రదాడులకు పథకరచన చేశాడు. ఇతనికి వ్యతిరేకంగా ఇంటర్‌పోల్ గతంలోనే రెడ్‌నోటీస్ ఇచి్చంది. ఇతడిని తమకు అప్పగించాలని 2002లోనే భారత్ పాకిస్తాన్‌ను కోరింది. అజార్‌ను జమ్మూ జైలు నుంచి తప్పించేందుకు పలుమార్లు ప్లాన్‌లు వేసి విఫలమయ్యాడు. చివరకు భారత ఎయిర్‌పోర్టులో భద్రతావైఫల్యాలు ఉన్నట్లు పసిగట్టి హైజాక్ ప్లాన్‌ను అమలుచేశాడు. హైజాక్ జరిగిన 26 ఏళ్ల తర్వాత సూత్రధారిని భారతబలగాలు అంతం చేశాయి.
హఫీజ్ మొహమ్మద్ జమీల్
ఇతను కూడా జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు పెద్ద బావమరిది. యూసుఫ్‌కు ఇతను అన్నయ్య అవుతాడు. జైషేకు చెందిన మర్కాజ్ సుభాన్ అల్లాహ్‌లోని అతిపెద్ద శిక్షణా కేంద్రానికి ముహమ్మెద్ జమీల్ ఇన్‌చార్జ్‌గా ఉన్నాడు. యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేసి, టెర్రరిస్ట్‌లుగా మార్చాల్సిన ప్రధాన బాధ్యత ఇతనిదే. జైషే ఉగ్రసంస్థలో కీలకమైన వ్యక్తి. జైషే సంస్థ కోసం నిధులను సేకరించడంలోనూ అత్యంత చురుగ్గా ఉంటాడు.
ముదస్సార్ ఖదియాన్ ఖాస్
లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో ముదస్సార్ ఖదియాన్ ఖాస్ అత్యంత కీలకమైన వ్యక్తి. ఇతనికి అబూ జుందాల్ అనే మారుపేరు ఉంది. సరిహద్దు నుంచి కేవలం పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న మురిద్కేలోని మర్కాజ్ తైబా ఉగ్రస్థావరానికి ఇతనే సారథ్యం వహిస్తున్నాడు. ముంబైదాడుల్లో ప్రాణాలకు తెగించి పోలీసులు పట్టుకున్న ఉగ్రవాది అజ్మల్ కసబ్ ఈ స్థావరంలోనే శిక్షణ పొందాడు. మే 7 అర్థరాత్రి తర్వాత భారత దాడుల్లో ఖదియాన్ హతమయ్యాడు.
ఈ వార్త తెల్సి పాకిస్తాన్ సైన్యం ఉలిక్కిపడింది. వెంటనే ఇతని అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించింది. లష్కరే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ సారథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో అంత్యక్రియలు జరిగాయి. ఆర్మీ చీఫ్ మునీర్ తరఫున లెఫ్టినెంట్ జనరల్, పోలీస్‌విభాగం తరఫున పంజాబ్ ప్రావిన్సు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హాజరయ్యారు. పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ఇతని మృతదేహం వద్ద సైనికవందనం చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. దీంతో పాక్ ఆర్మీ, ఉగ్రసంస్థలకు మధ్య ఉన్న సత్సంబంధాలు ఇతని అంత్యక్రియల వీడియోతో మరోసారి ప్రపంచానికి తెల్సివచ్చాయి.
ఖలీద్ అలియాస్ అబూ అకాషా
లష్కరే తోయిబా ఉగ్రసంస్థ కమాండర్ అయిన ఖలీద్ అలియాస్ అబూ అకాషా సైతం ఈ దాడుల్లో హతమయ్యాడు. జమ్మూకశ్మీర్‌లో పలు ఉగ్రదాడులతో ఇతని ప్రత్యక్ష సంబంధం ఉంది. అఫ్గానిస్తాన్ నుంచి లష్కరే తోయిబా కోసం ఆయుధాలను అక్రమంగా తీసుకొచ్చేవాడు. ఇతని అంత్యక్రియలు పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌లో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. పాక్ ఆర్మీ సీనియర్ అధికారులు, పోలీస్‌విభాగం తరఫున పైసలాబాద్ డెప్యూటీ కమిషనర్ ఈ ఖనన క్రతువులో పాల్గొన్నారు.
మొహమ్మద్ హసన్ ఖాన్
జమ్మూకశ్మీర్‌లో వేర్వేరు ఉగ్రదాడులకు సమన్వయం చేయడంలో, సహాయసహకారాలు అందించడంలో మొహమ్మద్ హసన్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రస్థావర నిర్వహణ బాధ్యతలను చూసుకునే సీనియర్ ఉగ్రవాది ముఫ్తీ అస్ఘర్ ఖాన్ కశ్మీరీ కుమారుడే ఈ హసన్ ఖాన్.