పుణెకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ తండ్రి విశాల్ అగర్వాల్ ఇవాళ(శుక్రవారం) మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసి.. తన కుమారుడి హత్యకు కారణమైన నిందితులకు ఉరిశిక్ష విధించాలని కోరారు. మరోవైపు, తన కుమారుడు తలకు విగ్గు (కృత్రిమ జుట్టు) వాడుతున్నాడనే కారణంతోనే ఈ హత్య జరిగిందనే ఆరోపణలను ఆయన తండ్రి విశాల్ అగర్వాల్ ఖండించారు. నిశ్చితార్థానికి చాలా కాలం ముందే తన కుమారుడికి ఉన్న స్వల్ప జుట్టు రాలే సమస్య గురించి సియా గోయల్, ఆమె కుటుంబ సభ్యులతో బహిరంగంగానే చర్చించామన్నారు.
కేతన్‌కు తలపై ఒక చిన్న భాగంలో జుట్టు రాలింది. కానీ వివాహం ఖాయం కావడానికి ముందే ఈ విషయాన్ని వారికి స్పష్టంగా తెలియజేశామని విశాల్ అగర్వాల్ అన్నారు. కాగా, కేతన్ అగర్వాల్ విగ్ పెట్టుకోవడం సియా గోయల్‌కు నచ్చలేదని ఓ పోలీసు అధికారి పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. అగర్వాల్ విగ్ పెట్టుకున్న మాట నిజమే.. కానీ సియాకు అతను నచ్చకపోవడానికి అది ఒక్కటే కారణమని చెప్పలేమని ఆ అధికారి పేర్కొన్నారు.
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు మాట్లాడుతూ.. జూన్ 18న లోహగడ్ కోటపై నుండి చౌదరి.. అగర్వాల్‌ను కిందకు నెట్టేయడానికి ముందు.. గోయల్ ముందుగా అనుకున్న ప్రకారం ఒక సంకేతాన్ని (సిగ్నల్) ఇచ్చిందని తెలిపారు. ఈ ఇద్దరూ పారిపోతే తమ కుటుంబాల ప్రతిష్ట దెబ్బతింటుందనే భయంతో కేతన్ అగర్వాల్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొదట ఇద్దరూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడానికి ప్రయత్నించారు. విచారణ సమయంలో నేరస్థులలో ఇలాంటి ధోరణి సాధారణంగా కనిపిస్తుంది. అయితే.. చివరకు తానే ఈ కుట్ర పన్నానని.. ఇందులో చేతన్ ప్రమేయం కూడా ఉందని సియా అంగీకరించిందని ఓ పోలీసు అధికారి తెలిపారు.
చౌదరి మొదట మాట్లాడుతూ.. తాను కోట వద్దే ఉన్నానని.. అయితే అగర్వాల్‌ను నెట్టేసిన ప్రదేశానికి తాను వెళ్లలేదని.. అసలు అక్కడ ఏం జరిగిందో తనకు తెలియదని వాదించాడు. అయితే, అతను అబద్ధం చెబుతున్నాడని స్పష్టంగా తెలిసిందన్న అధికారి.. ఆ తర్వాత ఇద్దరు నిందితులూ తమ తప్పును అంగీకరించి.. ఘటన ఎలా జరిగిందో వివరించారని తెలిపారు.
అగర్వాల్, గోయల్‌ల వివాహం నవంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఒక ప్యాలెస్‌లో జరగాల్సి ఉంది. ఈ నేరానికి బాధ్యులైన వారికి కఠిన శిక్ష పడాలని గోయల్ తండ్రి కూడా కోరారు. ఇందులో తన కూతురి ప్రమేయం ఉన్నా సరే, ఆమెకు కూడా అదే శిక్ష పడాలన్నారు. కేతన్ నాకు కొడుకు లాంటివాడు.. అతని మరణం మా రెండు కుటుంబాలను విషాదంలో ముంచేసింది. మేము పెళ్లి పనుల్లో ఎంతో ఆత్రుతగా ఉన్నాం. జరిగినదంతా చాలా విషాదకరం.
ఈ రోజుకీ మేము దీన్ని నమ్మలేకపోతున్నాం’’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సియా సంబంధాల గురించిన నిజాలను గోయల్ కుటుంబం దాచిపెట్టిందన్న అగర్వాల్ తండ్రి ఆరోపణలను ఆయన ఖండించారు. వారి మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నాయనే విషయం కానీ.. సియాకు మరొకరితో సంబంధం ఉందనే విషయం కానీ తమకు తెలియదని ఆయన చెప్పారు.
కాగా, సీఎం ఫడ్నవీస్ ఈ ఘటనను అత్యంత దిగ్భ్రాంతికరంగా అభివర్ణించారు. ఈ ఘటనను ఒక నేరంగానే కాకుండా.. సమాజం లోతుగా ఆలోచించాల్సిన విషయంగా చూడాలన్నారు. చదువుకుని, సమాజంలో మంచి స్థితిలో ఉన్న కుటుంబాల పిల్లల్లో ఇలాంటి ద్వేషపూరిత, వినాశకరమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఈ మానసిక స్థితి వెనుక ఉన్న కారణాలు ఏమిటి? దీనిపై మనం లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.


