మహారాష్ట్ర పురపాలక ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘనవిజయం సాధించగా, ఈ విజయానికి ప్రధాన శక్తిగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ప్రతిధ్వనిస్తోంది. ఎన్నికల ముందు ఆయన చేసిన ప్రకటన “మా గత రికార్డులన్నింటినీ తిరగరాస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లను కైవసం చేసుకుంటాం” అనేది కేవలం నినాదంగా కాకుండా, ఫలితాల్లో నిజమైంది. ఈ విజయంతో ఆయనకు అట్టడుగు స్థాయి ప్రజల నుండి గట్టి ఆదరణ ఉందని స్పష్టమైంది.
ముఖ్యంగా ముంబైలో తన పట్టును నిలుపుకోవడం ఫడ్నవీస్ కోసం కీలకంగా మారింది. ఠాక్రే సోదరులు ఉద్ధవ్, రాజ్ 20 ఏళ్ల వైరాన్ని పక్కన పెట్టి ఒకటయ్యే ప్రయత్నం చేసినా, ఫడ్నవీస్ వ్యూహాలు వారి ఆశలపై నీళ్లుజల్లాయి. ప్రచారంలో ఆయన స్వయంగా ముందుండి, ప్రతి కార్పొరేషన్‌లోనూ కలియదిరిగి ప్రజలతో మమేకమయ్యారు. వయోజన ఓటర్లతో పాటు యువత, ముఖ్యంగా జెన్ జెడ్ తరాన్ని తన సూటి.. ఆధునిక ప్రచార శైలితో ఆకట్టుకున్నారు.
దక్షిణ భారతీయులను ముంబై నుంచి వెళ్లగొడతామన్న ఠాక్రేల హెచ్చరికల నడుమ, ఫడ్నవీస్ వారిని అక్కున చేర్చుకోవడం ఆయనకు అదనపు మద్దతు తెచ్చింది. నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్న ఆ ప్రాంతీయులు ఆయనను తమవాడిగా భావించారు. అంతేకాకుండా, ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ అయిన ధారావీ అభివృద్ధి ప్రాజెక్టును ప్రకటించడం.. ముంబై వాసుల కోసం పలు పథకాలను ప్రవేశపెట్టడం ఆయనకు విశేష ఆదరణను తెచ్చింది.
ఈ విజయంతో 54 ఏళ్ల ఫడ్నవీస్ మరాఠా రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అవతరించారని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన కేవలం ఒక నాయకుడిగానే కాకుండా, వ్యూహకర్తగా, ప్రజల మనసులను గెలుచుకున్న వ్యక్తిగా నిలిచారు. మహాయుతి కూటమి విజయాన్ని బ్లాక్‌బస్టర్‌గా మార్చిన హీరోగా ఆయన పేరు మరాఠా రాజకీయ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోనుంది.


