అడ్రస్‌ మారితే చెప్పాల్సిందే! | Supreme Court Rules Employees Must Update Address, Upholds Termination In Absence Case, Check More Details Inside | Sakshi
Sakshi News home page

అడ్రస్‌ మారితే చెప్పాల్సిందే!

Jun 23 2026 10:50 AM | Updated on Jun 23 2026 10:59 AM

Employee Who Didn't Inform Employer Of Address Change

లేదంటే పాత చిరునామాకు పంపిన నోటీసే చెల్లుబాటు 

నోటీసు అందలేదన్న ఉద్యోగి సాకును అంగీకరించలేం 

స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. కింది కోర్టుల తీర్పుల రద్దు 

సాక్షి, న్యూఢిల్లీ: నివాస చిరునామా మారినప్పుడు ఆ విషయాన్ని యాజమాన్యానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉద్యోగిదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అడ్రస్‌ అప్‌డేట్‌ చేయకపోవడం వల్ల పాత చిరునామాకు పంపిన షోకాజ్‌ నోటీస్‌ అందలేదని, అందువల్ల తనపై తీసుకున్న చర్యలు చెల్లవంటూ వాదించడాన్ని అంగీకరించలేమని తేల్చిచెప్పింది. ముందుగా అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన ఓ ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ లేబర్‌ కోర్టు, అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రిఫిలిస్‌ ఇంజనీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పనిచేసే అర్జున్‌ గుప్తా అనే ఉద్యోగి అనుమతి లేకుండా 24 రోజులు విధులకు గైర్హాజరయ్యాడు. 

దీంతో యాజమాన్యం అతని సొంత రాష్ట్రం బిహార్‌లోని చిరునామాకు షోకాజ్‌ నోటీసు పంపింది. అయితే, అప్పటికే నోయిడాకు మకాం మార్చానని, ఆ నోటీసు అందలేదని పిటిషనర్‌ వాదించాడు. తల్లికి అనారోగ్యం వల్లే తాను విధులకు హాజరుకాలేదని పేర్కొన్నాడు. దీనిపై విచారించిన లేబర్‌ కోర్టు, అలహాబాద్‌ హైకోర్టు ఉద్యోగికి అనుకూలంగా తీర్పునివ్వగా యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉద్యోగి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరయ్యాడని, తల్లి అనారోగ్యానికి ఆధారాలు చూపలేదని యాజమాన్యం వాదించింది. అయితే, చిరునామా మారినందున నోటీసు అందలేదని, విధుల్లోకి చేరనివ్వకపోవడం చట్టవిరుద్ధమని ఉద్యోగి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. 

ఈ అప్పీల్‌ను జస్టిస్‌ విక్రమ్‌ నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాల ధర్మాసనం విచారించింది. ‘రికార్డుల్లో ఉన్న చిరునామాకే యాజమాన్యం సమాచారం పంపుతుంది. అడ్రస్‌ మారినప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఉద్యోగిదే. తన వైఫల్యాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉద్యోగికి ఇవ్వలేం. తల్లి అనారోగ్యానికి సంబంధించి కనీస వైద్య ఆధారాలను కూడా సమర్పించలేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తగిన ఆధారాలు లేకుండానే ఉద్యోగికి అనుకూలంగా కింది కోర్టులు ఇచ్చిన తీర్పులను ధర్మాసనం రద్దు చేసింది. సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగిస్తూ కంపెనీ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధమేనని తీర్పు వెలువరించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement