
2030 నాటికి చేరుకుంటుంది
పట్టణీకరణ, ఆదాయ వృద్ధి అనుకూలిస్తాయ్
డెలాయిట్ ఇండియా నివేదిక అంచనా
న్యూఢిల్లీ: గృహ నిర్మాణ పరిశ్రమ 2030 నాటికి 350 బిలియన్ డాలర్ల స్థాయికి (సుమారు రూ.31 లక్షల కోట్లు) చేరుకుంటుందని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. ఇందులో ఒక్క బిల్డింగ్ మెటీరియల్స్ (నిర్మాణంలోని వినియోగించే ముడి పదార్థాలు) విభాగమే ప్రస్తుతమున్న 105 బిలియన్ డాలర్ల నుంచి ఏటా 9.6 శాతం వృద్ధితో 2030 నాటికి 166 బిలియన్ డాలర్ల స్థాయికి విస్తరిస్తుందని పేర్కొంది. ఆదాయం పెరుగుతుండడం, పట్టణీకర వేగాన్ని అందుకోవడం, ప్రభుత్వ విధాన నిర్ణయాలు ఇందుకు దోహదం చేస్తాయని తెలిపింది. భారత దేశ నిర్మాణరంగం, నిర్మాణ రంగ మెటీరియల్స్ పరిశ్రమ కీలక మలుపు వద్ద ఉన్నట్టు డెలాయిట్ నివేదిక పేర్కొంది.
కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ 18.5 బిలియన్ డాలర్లు
‘‘వైర్లు, కేబుళ్లు, ఫ్యాన్లు, లైట్లు, స్విచ్‌లు, ఫ్యూజ్‌లు, స్విచ్‌గేర్లతో కూడిన కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ పరిశ్రమ పరిమాణం 2030 మార్చి నాటికి 18.5 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుంది. మౌలిక వసతుల అభివృద్ధి, పట్టణీకరణ అనుకూలిస్తుంది. ఇంధన ఆదా ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతుండడం, విధాన పరమైన మద్దతు ఈ విభాగాన్ని ముందుకు నడిపిస్తాయి. 2023 నాటికి కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ అమ్మకాల్లో బ్రాండెడ్ ఉత్పత్తుల వాటా 76 శాతంగా ఉండగా, 2027 నాటికి 82 శాతానికి చేరుకుంటుంది’’అని ఈ నివేదిక వెల్లడించింది.
62 బిలియన్ డాలర్లకు హోమ్ ఫర్నిచర్
ఇళ్లలో వినియోగించే ఫరి్నచర్, డెకరేటివ్స్ మార్కెట్ విలువ ప్రస్తుతమున్న 38 బిలియన్ డాలర్ల నుంచి 62 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుందనేది డెలాయిట్ ఇండియా అంచనా. ‘‘ఈ విభాగం బలమైన వృద్ధి క్రమంలో ఉంది. పట్టణీకరణకు తోడు ఆదాయాలు పెరుగుతుండడంతో ఆధునికత, వినూత్నతకు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు’’ అని డెలాయిట్ తెలిపింది.
గృహ రక్షణ ఉత్పత్తులకూ డిమాండ్
సెక్యూరిటీ కెమెరాలు, స్మార్ట్ లాక్‌లు, డోర్ ఫోన్లు, డోర్‌బెల్ కెమెరాలు, మోషన్ సెన్సార్లు, ప్రమాదాలను నివారించే డివైజ్‌లతో కూడిన హోమ్ సెక్యూరిటీ మార్కెట్ ఏటా 18 శాతం చొప్పున వృద్ధి చెందనుంది. 2030 నాటికి 4.4 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. ఇక పెయింట్స్, కన్‌స్ట్రక్షన్ కెమికల్స్ పరిశ్రమ 2030 మార్చి నాటికి 15.3 బిలియన్ డాలర్ల స్థాయికి వృద్ధి చెందుతుందని తెలిపింది. ఫ్లోరింగ్ మార్కెట్ (సిరామిక్ టైల్స్, వినైల్ ఫ్లోరింగ్, మార్బుల్ తదితర) పరిమాణం ప్రస్తుతమున్న 10.7 బిలియన్ డాలర్ల నుంచి 2030 మార్చి నాటికి 16.2 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని డెలాయిట్ తెలిపింది.