సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సొంతూళ్లకు పయనం
రాష్ట్రంలో 8–10 లక్షల మంది బిహారీ శ్రామికులు ఉంటారని అంచనా
వలస ఓటర్ల కోసం ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్న అక్కడి రాజకీయ పార్టీలు
ప్రయాణికులతో కిటకిటలాడుతున్న రైళ్లు, బస్సులు
సాక్షి, హైదరాబాద్: బిహార్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజధానిలో నిర్మాణ రంగ పనులు నెమ్మదిస్తున్నాయి. ఈ నెల 6, 11 తేదీల్లో రెండు దశల్లో బిహార్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడి రాజకీయ పార్టీలు వలస ఓటర్ల తరలింపుపై దృష్టి సారించాయి. వారిని సొంత ప్రాంతాలకు రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. పలు ప్రధాన పార్టీలు వలస ఓటర్లను రప్పించేందుకు రైలు, బస్ టికెట్లు, భోజన ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి.
వలస ఓటర్లకు సెలవు ఇవ్వాలిందిగా ఆయా వలస కార్మికులు పనిచేసే కర్మాగారాల యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. దీంతో సొంతూళ్ల పయనమైన వలసదారులతో రైళ్లు, ప్రత్యేక బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే గత నెలాఖరులో దీపావళి, ఛట్ పూజ కోసం సొంతూళ్లకు వెళ్లిన కొందరు బిహారీలు ఇక ఎన్నికల తర్వాతే తిరిగి పనికి వస్తారని ఓ నిర్మాణదారుడు తెలిపారు. ఇప్పటికే కార్మికుల కొరతను ఎదుర్కొంటున్న తెలంగాణలో బిహార్ ఎన్నికల రూపంలో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు.
8–10 లక్షల మంది బిహారీలు..
బిహార్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం సుమారు 45.78 లక్షల మంది బీహారీలు వివిధ రాష్ట్రాలలో పనిచేస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 25–30 లక్షల మంది వలస కార్మికులు ఉండగా.. ఇందులో బిహార్ నుంచే సుమారు 8–10 లక్షల మంది ఉంటారని అంచనా. ఇందులో 80 శాతం బ్లూ కాలర్ వర్కర్లు కాగా.. మిగిలిన వారు వైట్ కాలర్ ప్రొఫెషనల్స్, విద్యార్థులు ఉంటారు.
బిహారీలు ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో వలస వచ్చి స్థానికంగా ఉపాధి పొందుతున్నారు. హైదరాబాద్‌లో ఎక్కువగా బోరబండ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, హఫీజ్‌పేట, సికింద్రాబాద్‌లో నివసిస్తున్నారు.
గ్రేటర్ రియల్టీపై ప్రభావం..
దేశవ్యాప్తంగా నిర్మాణ రంగానికి వచ్చే ఐదేళ్లలో 4.5 కోట్ల మంది నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి అవసరం ఉంటుందని అంచనా. ప్రస్తుతం మన రాష్ట్రంలో వేర్వేరు రాష్ట్రాల నుంచి సుమారు 18 లక్షల మంది వలస కార్మికులు ఇక్కడకు వచ్చి నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) తెలంగాణ అధ్యయనం వెల్లడించింది.
ప్రధానంగా బిహారీలు హైదరాబాద్‌లో నిర్మాణ రంగంతో పాటు రైస్ మిల్లులు, చికెన్ షాపులు, పారిశ్రామిక వాడల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. తాజాగా బిహార్ ఎన్నికల నేపథ్యంలో వీరిలో చాలా మంది సొంతూళ్లకు పయనమవుతున్నారని, దీంతో నిర్మాణ పనులు నెమ్మదించే అవకాశాలున్నాయని క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి తెలిపారు.


