
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో 2021 నుండి ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలను భర్తీ చేయడానికి ద్వైవార్షిక ఎన్నికలను అక్టోబర్ 24న నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) బుధవారం ప్రకటించింది. పోలింగ్ ముగిసిన గంట తర్వాత అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపింది.
జమ్ముకశ్మీర్‌లోని నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన దాదాపు సంవత్సరం తర్వాత ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు జరనున్నాయి. గులాం నబీ ఆజాద్, నజీర్ అహ్మద్ లావేల పదవీకాలం 2021, ఫిబ్రవరి 15తో ముగిసింది. నాటి నుంచి పార్లమెంటు ఎగువ సభలో ఈ కేంద్రపాలిత ప్రాంతం ప్రాతినిధ్యం వహించలేదు. మరో ఇద్దరు సభ్యులైన ఫయాజ్ అహ్మద్ మీర్, షంషీర్ సింగ్ మన్హాస్ కూడా అదే ఏడాది ఫిబ్రవరి 10న తమ పదవీకాలాన్ని పూర్తి చేశారు.
జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ప్రస్తుత జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు రాజ్యసభ సభ్యులు జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి కేటాయించిన సీట్లను భర్తీ చేయడానికి ఎన్నికైనట్లు గుర్తింపు పొందుతారు. ఖాళీలు ఏర్పడే సమయంలో ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన ఓటర్ల సంఖ్య లేకపోవడంతో సిట్టింగ్ సభ్యుల పదవీకాలం ముగిసినప్పటి నుండి ఈ నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కాగా పంజాబ్‌కు చెందిన ఒక రాజ్యసభ స్థానానికి కూడా ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు పోల్ బాడీ ప్రకటించింది. ఓటింగ్, కౌంటింగ్ అక్టోబర్ 24న జరగనుంది. ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా రాజీనామా చేసిన తర్వాత పంజాబ్‌లోని ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది. పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ పదవీకాలం 2028 ఏప్రిల్ 9న ముగియనుంది.