సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఎన్నికల సమయాల్లో ప్రభుత్వ యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) పునరుద్ఘాటించింది. ఈ విషయంలో విరమణ అనంతరం మళ్లీ ప్రభుత్వ పదవుల్లో నియమితులైన అధికారులకు సైతం ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేసింది. వీరు సైతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎలక్షన్ కోడ్) పరిధిలోకి వస్తారని తెలిపింది.
త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం సరీ్వసులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా, కాంట్రాక్టు, తాత్కాలిక ప్రాతిపదికన మళ్లీ నియమితులైన అధికారులు, సలహాదారులు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూడా నిబంధనలు, రాజకీయ తటస్థత (పొలిటికల్ న్యూట్రాలిటీ) నిబంధనలు పూర్తి స్థాయిలో వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు సంబంధిత రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులు, ముఖ్య ఎన్నికల అధికారు (సీఈవో)లకు సోమవారం ఈసీ లేఖలు రాసింది.


