సమస్తీపూర్‌లో రోడ్డు పక్కన పడేసిన వీవీప్యాట్ స్లిప్పులు, కత్తిరించని కొన్ని స్లిప్పులు
బిహార్‌లో తీవ్ర కలకలం
అవి మాక్ పోల్ స్లిప్పులన్న అధికారులు
సమస్తీపూర్: బిహార్‌లోని సమస్తీపూర్‌లో పెద్ద సంఖ్యలో వీవీప్యాట్(ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్)స్లిప్పులను రోడ్డు పక్కన విసిరేసినట్లుగా ఉన్న వీడియో ఒకటి తీవ్ర కలకలం రేపింది. శనివారం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరలవుతోంది. పార్టీ గుర్తులు ముద్రించి ఉన్న ఆ స్లిప్పులను జనం ఏరుతున్నట్లుగా అందులో కనిపిస్తోంది. దీనిపై ప్రతిపక్ష ఆర్జేడీ సీరియస్‌గా స్పందించింది. అవి ఈవీఎంల నుంచి పడేసిన స్లిప్పులేనని పేర్కొంది. అయితే, అవి పోలింగ్ ముందు రోజైన బుధవారం నిర్వహించిన మాక్ పోల్‌కు సంబంధించిన స్లిప్పులు మాత్రమేనని, వాస్తవ ఓటింగ్‌నకు సంబంధించినవి కావని జిల్లా యంత్రాంగం తెలిపింది.
మాక్ పోల్ తర్వాత స్లిప్పులను కత్తిరించి బయటపడేశామని, అందులో కట్ కాని కొన్ని స్లిప్పులు స్థానికులు ఏరుకున్నారని డీఎం రోషన్ కుష్వాహా వివరించారు. తాము స్వయంగా ఘటనాస్థలికి వెళ్లి వాటిని పరిశీలించామన్నారు. వాటిపై ఉన్న ఈవీఎంల నంబర్ల ఆధారంగా బాధ్యులైన పోలింగ్ సిబ్బంది గుర్తించవచ్చని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. సంబంధిత నియోజకవర్గంలోని అభ్యర్థులకు ఈ విషయం తెలిపామన్నారు.
ఇందుకు బాధ్యుడైన అసిస్టెంట్ రిటరి్నంగ్ అధికారి(ఏఆర్‌వో)పై కఠినచర్యలు తీసుకోవాలని ఈసీ ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఆదేశించారు. సంబంధిత ఏఆర్‌వోను సస్పెండ్ చేయడంతోపాటు కేసు నమోదు చేస్తామన్నారు. ఘటనపై విచారణ చేపట్టి, సవివర నివేదిక అందజేయాలని ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు. ఓటింగ్ ప్రక్రియపై ఈ ఘటన ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు. పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు, వీవీప్యాట్‌ల పనితీరును పరిశీలించే ఉద్దేశంతో మాక్ పోల్ ప్రక్రియను చేపడతారు. అనంతరం, అందులోని ట్రయల్స్‌కు సంబంధించిన డేటాను పూర్తిగా తొలగిస్తారు.


