సీజేపీ ‘నీట్ నిరసనల’ నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గత కొంతకాలంగా హస్తిన రాజకీయాల్లో పెద్దగా కనిపించని ఈ ఒడిశా ఎంపీ.. రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి సారించారు. మధ్య మధ్యలో విపక్షాలపై, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపైనా ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అమెరికాలో పనిచేస్తున్న భారతీయుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్న వేళ ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ నిపుణులు స్వదేశానికి తిరిగివస్తే దేశ సాంకేతిక రంగానికి మరింత బలం చేకూరుతుందన్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. అమెరికాలో భారతీయ ఉద్యోగుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఈ అంశంపై రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లోనూ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ఇచ్చిన పిలుపుపై ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు.
‘‘మీతో ఏకీభవిస్తున్నా వెంబు గారూ’’ అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగం అభివృద్ధిలో భారతీయ ప్రతిభ గణనీయమైన పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను దేశీయ సామర్థ్యాలను పెంచుకునే అవకాశంగా మలుచుకోవాలని సూచించారు.
‘‘ప్రతి సవాలూ మన బలాన్ని మరింత పెంచుకోవడానికి, సామర్థ్యాలను విస్తరించుకోవడానికి, దేశంలో మరిన్ని ఆవిష్కరణలకు దోహదపడే అవకాశమే. మన ప్రతిభపై నమ్మకంతో పాటు స్వదేశీ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్న నిబద్ధత ఉంటే.. సాంకేతిక రంగ భవిష్యత్తును తీర్చిదిద్దగలం’’ అని ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు.
I agree with you, @SVembu Ji. Indian talent has made significant contributions to the advancement of technology across the world. Every challenge presents an opportunity to build on this strength, deepen our capabilities and foster greater innovation at home. With confidence in our talent and a commitment to building indigenous capabilities, we can help shape the future of technology. 🇮🇳
— Dharmendra Pradhan (@dpradhanbjp) October 9, 2026
‘అమెరికాకు ఇక మనం అక్కర్లేదంటున్నారు’
అమెరికాలో వీసాలపై పనిచేస్తున్న భారతీయులు స్వదేశానికి తిరిగి రావాలని శ్రీధర్ వెంబు అంతకుముందు పిలుపునిచ్చారు. ‘‘అమెరికా సాంకేతిక పురోగతికి భారతీయులు ఎంతో కీలకమైన సహకారం అందించారు. అయినప్పటికీ అమెరికాలోని పెద్ద వర్గం ఇప్పుడు మనల్ని కోరుకోవడం లేదు’’ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ పరిస్థితిని కొత్త భవిష్యత్తుకు నాందిగా మలుచుకోవాలని, భారతీయ నిపుణులు తిరిగివచ్చి దేశాన్ని నిర్మించడంలో భాగస్వాములు కావాలని కోరారు.
గ్రీన్‌కార్డు ప్రక్రియపై అనిశ్చితి
అమెరికాలోని పలు సాంకేతిక సంస్థలకు సంబంధించిన శాశ్వత నివాస అనుమతుల ప్రక్రియపై ఆంక్షలు, సస్పెన్షన్ల వార్తలు భారతీయ ఉద్యోగుల్లో ఆందోళన పెంచాయి. ముఖ్యంగా పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ (PERM) కార్యక్రమానికి సంబంధించిన పరిణామాలు చర్చకు దారితీశాయి. అమెరికాలో ఉద్యోగదాతల ద్వారా గ్రీన్‌కార్డు పొందే ప్రక్రియలో ఇది కీలకమైన దశ. ఈ పరిణామాలతో అక్కడ పనిచేస్తున్న విదేశీ నిపుణులు, ముఖ్యంగా భారతీయుల శాశ్వత నివాస ప్రక్రియపై అనిశ్చితి నెలకొంది. అయితే పీఈఆర్‌ఎం ప్రక్రియపై ఆంక్షలు విధించడం వల్ల ఇప్పటికే ఉన్న హెచ్-1బీ వీసాలన్నీ వెంటనే రద్దవుతాయని కాదు. కానీ, గ్రీన్‌కార్డు కోసం ముందుకు సాగే ప్రక్రియపై మాత్రం ప్రభావం పడే అవకాశం ఉంది.
స్వదేశీ సాంకేతిక సామర్థ్యాలపై చర్చ
అమెరికా సాంకేతిక రంగంలో భారతీయ నిపుణులు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో.. వారి అనుభవం, నైపుణ్యాలను దేశీయ పరిశ్రమల అభివృద్ధికి వినియోగించుకోవాలన్న చర్చ మరోసారి ముందుకొచ్చింది. విదేశాల్లో స్థిరపడిన ప్రతిభావంతులు స్వదేశానికి వస్తే పరిశోధన, ఆవిష్కరణలు, కొత్త సాంకేతిక సంస్థల అభివృద్ధికి తోడ్పడే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు తగిన ఉద్యోగావకాశాలు, పరిశోధన సదుపాయాలు, పారిశ్రామిక వాతావరణం కూడా అవసరం. శ్రీధర్ వెంబు చేసిన పిలుపునకు ధర్మేంద్ర ప్రధాన్ మద్దతు తెలపడం.. భారతీయ ప్రతిభను దేశ అభివృద్ధికి ఎలా వినియోగించుకోవాలన్న చర్చకు మరింత ప్రాధాన్యం తెచ్చింది. స్వదేశంలోనే ప్రపంచస్థాయి సాంకేతిక ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం కల్పించాల్సిన అవసరాన్ని ఈ వ్యాఖ్యలు మరోసారి గుర్తుచేస్తున్నాయి.
2026 మే 3న జరిగిన నీట్-యూజీ పరీక్షలో అక్రమాలు వెలుగుచూడటంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మే 12న పరీక్షను రద్దు చేశారు.సీబీఐ విచారణకు ఆదేశించినప్పటికీ, పరీక్షల నిర్వహణలో అవకతవకలకు బాధ్యత వహించాలని విద్యార్థి సంఘాలు, విపక్షాలు డిమాండ్ చేశాయి. జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) ఆధ్వర్యంలో ప్రధాన్ రాజీనామా కోరుతూ నిరసనలు ప్రారంభమయ్యాయి. వారాలపాటు సాగిన ఆందోళనలు, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం వచ్చిన డిమాండ్లు, విపక్షాల నుంచి కూడా ప్రధాన్ రాజీనామా డిమాండ్.. కేంద్రంపై ఒత్తిడి పెంచాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తు, దేశ ఐక్యతను దృష్టిలో ఉంచుకుని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు జులై 25న ఆయన ప్రకటించారు. ఆ తర్వాత ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషిని విద్యాశాఖ మంత్రిగా నియమించారు.
ఇదీ చదవండి: జెన్‌జీకి భయపడే ఎమర్జెన్సీ విధింపు!


