ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం(నవంబర్ 10వ తేదీ) రాత్రి జరిగిన భారీ పేలుళ్లలో అక్కడికక్కడే తొమ్మిది మంది దుర్మరణం చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు అసువులు బాశారు. ఈ ఉగ్ర కార్యకలాపాలకు కారణమైన ఒక్కొక్కరినీ స్పెషల్ టీమ్స్ అదుపులోకి తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మరో కారును స్వాధీనం చేసుకున్నారు.
హరియాణాలోని ఖండవాలీ గ్రామంలో రెడ్ పోర్డ్ ఈకోస్పోర్ట్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఢిల్లీ కారు బాంబు పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న డాక్టర్ ఉమర్‌దిగా గుర్తించారు. ఆ కారు సదరు గ్రామంలో ఓ ఇంటి బయట పార్క్ చేసి ఉండటంతో దాన్ని తనిఖీ చేసి చూడగా అది ఉమర్ మహ్మద్‌కు చెందినిదిగా కనుగొన్నారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ కారులోనే ఢిల్లీ పేలుళ్లకు సంబంధించి భారీ పేలుడు పదార్థాలను తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు.
ఇదిలా ఉంచితే, ఢిల్లీలో పేలుళ్ల నేపథ్యంలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కారు పేలుడు ఘటనలో తదుపరి కార్యచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
సోమవారం రాత్రి జరిగిన పేలుడు ధాటికి సమీప మార్కెట్‌లోని ప్రజలు, రోడ్లమీద ఉన్న వ్యక్తులు ప్రాణభయంతో పరుగులుతీశారు. తీవ్రస్థాయి పేలుడు కారణంగా మృతదేహాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో అక్కడ భీతావహవాతావరణం నెలకొంది.
మంటలు, హాహాకారా లు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీ సమీప ఫరీదాబాద్‌లో 2,900 కేజీల పేలుడు పదార్థాలను జమ్మూకశ్మీర్, హరియాణా, యూపీ పోలీసుల బృందం స్వాదీనంచేసుకున్న కొన్ని గంటలకే ఢిల్లీలో భారీ పేలుడు సంభవించడం యాధృచ్ఛికం కాదని దర్యాప్తు వర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి.


