ఇటీవల ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)లో సమస్యలతో వందకు పైగా విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం కనిపించిన విషయం తెలిసిందే..! ఇందుకు కారణం.. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) సిగ్నల్స్ స్పూఫింగ్ జరగడమేనని నిపుణులు ప్రాథమికంగా అంచనా వేసినా.. అధికారికంగా ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. అయితే.. తాజా ఢిల్లీ బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో కొన్ని రోజులుగా భారత కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్గాలు జీపీఎస్ స్పూఫింగ్ చేసి ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కుట్ర కోణంపై ఉప్పందండంతో..
నిజానికి 10 రోజులుగా దేశంలో ఏదో ఒక చోట ఉగ్రవాదులు అరెస్టవుతున్నారు. ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఆపరేటివ్‌లు, లష్కరే తాయిబా ఉగ్రవాదులు, సానుభూతిపరులు పట్టుబడుతున్నారు. జమ్మూకశ్మీర్, హర్యానాల్లో ఏకంగా 300 ఆర్డీఎక్స్, 2,900 కిలోల అమ్మోనియం నైట్రేట్ పేలుడు పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. దీన్ని బట్టి.. ఉగ్రవాద చర్యలపై ముందుగానే నిఘా వర్గాలకు ఉప్పందింది. ఆ కుట్రలను భగ్నం చేసేందుకే జీపీఎస్ స్పూఫింగ్ చేపట్టారు. ఈ కారణంగానే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. అయితే.. బాంబు పేలుళ్లకు యత్నించే ఉగ్ర మూకలకు సైతం జీపీఎస్ స్పూఫింగ్ కారణంగా తమ టార్గెట్ లొకేషన్‌ను ఎంచుకోవడంలో అడ్డుకట్ట వేసినట్లవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జీపీఎస్ స్పూఫింగ్ సాధ్యమేనా?
సాధారణంగా హ్యాకర్లకు శాటిలైట్ ఆధారిత జీపీఎస్ సిగ్నళ్లను స్పూఫ్ చేయడం దాదాపుగా అసాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. అయితే.. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్(సీఐ సెల్), భారత నిఘా సంస్థ(ఐబీ), మిలటరీ ఇంటెలిజెన్స్ వంటి సంస్థలు జీపీఎస్ స్పూఫింగ్ చేసే అవకాశాలున్నాయి. శత్రుడ డ్రోన్లు, నిఘా విమానాలను తప్పుదోవ పట్టించేందుకు, వాటిని దాడుల నుంచి నిరోధించేందుకు ఈ చర్యలు తీసుకుంటారు. ముఖ్యమైన ప్రదేశాలను ‘హార్డ్‌డెన్’ (రక్షణ) కల్పించేందుకు రియల్ టైమ్ మాస్క్ వేస్తారని సమాచారం. ఢిల్లీ విమానాశ్రయం కూడా అత్యంత కీలకమైనది కావడంతో.. రన్‌వే నుంచి సుమారు 60 నాటికల్ మైళ్ల పరిధి వరకు జీపీఎస్ స్పూఫింగ్ ప్రభావం కనిపించింది. సాధారణంగా ఇంతటి పరిధిలో స్పూఫింగ్ జరగడం చాలా అరుదు. యుద్ధాల సమయంలోనే ఇలా స్పూఫింగ్ చేస్తుంటారని తెలుస్తోంది. శత్రు దాడుల నుంచి రక్షణ రంగ సంస్థలను కాపాడేందుకు కూడా ఓపెన్ సోర్స్ ట్రాప్ పేరుతో జీపీఎస్ స్పూఫింగ్ చేస్తారని తెలుస్తోంది.
ఎలా చేస్తారు?
జీపీఎఫ్ స్పూఫింగ్‌కు రెండు మార్గాలను నిఘావర్గాలు ఎంచుకుంటాయని సమాచారం. వాటిల్లో మొదటిది జామింగ్(blocking) కాగా.. రెండోది జీపీఎస్ స్పూఫింగ్. మొదటి దాంట్లో జీపీఎస్ రిసీవర్‌కు ఉపగ్రహ సిగ్నళ్లను బ్లాక్(no fix) చేస్తారు. రెండో పద్ధతిలో ఫేక్ సిగ్నల్స్‌ని పంపుతారు. అంటే.. అసలైన జీపీఎస్ లొకేషన్ కాకుండా.. ఫేక్ లొకేషన్ కనిపిస్తుంది. ఇలా స్పూఫింగ్ చేయడానికి మిలటరీ గ్రేడ్ ప్రీక్వెన్సీ- ఈడబ్ల్యూ ట్రాన్స్‌మిటర్లు అవసరమని రేడియో ఫ్రీక్వెన్సీ(ఆర్ఎఫ్) ఇంజనీర్లు చెబుతున్నారు.


