పదో అంతస్తు పైనుంచి పడి.. ప్రాణాలతో బయటపడి..
బుధవారం ఉదయం.. సూరత్‌లోని జహంగీర్‌పురా ‘టైమ్స్ గెలాక్సీ’ అపార్ట్‌మెంట్ వాసులకు ఒళ్లు జలదరించే దృశ్యంతో ఆరోజు తెల్లారింది. నిశ్శబ్దంగా ఉండే ఆ ప్రాంతం ఒక్కసారిగా హాహాకారాలతో నిండిపోయింది. అందరూ తలెత్తి ఆకాశం వైపు భయం భయంగా చూస్తున్నారు. అక్కడ.. ఎనిమిదో అంతస్తు కిటికీ గ్రిల్‌కు ఒక మనిషి
తలకిందులుగా వేలాడుతున్నాడు.
అసలేం జరిగింది?
సూరత్: 57 ఏళ్ల నితిన్ భాయ్ అడియా తన పదో అంతస్తు ఫ్లాట్‌లో కిటికీ పక్కనే గాఢ నిద్రలో ఉన్నారు. నిద్రలో అటు ఇటు దొర్లుతూ, ప్రమాదవశాత్తు కిటికీలోంచి ఒక్కసారిగా బయటకు జారిపోయారు. పదో అంతస్తు అంటే దాదాపు వంద అడుగుల పైచిలుకు ఎత్తు. అక్కడి నుంచి పడితే ప్రాణాలు దక్కడం అసాధ్యం. కానీ, ఆయన అదృష్టం బావుంది. కిందకు పడిపోతున్న వేగంలో, సరిగ్గా ఎనిమిదో అంతస్తు కిటికీకి ఉన్న గ్రిల్ బాక్స్‌లో ఆయన కాలు బలంగా ఇరుక్కుపోయింది.
తలకిందులుగా గంటపాటు..
శరీరం మొత్తం గాలిలో.. ఒకే ఒక్క కాలు ఆ ఇనుప ఊచల మధ్య ఇరుక్కుపోయింది. తలకిందులుగా వేలాడుతూ, కాలి నొప్పిని భరిస్తూ ఆయన దాదాపు గంట కాలం మృత్యువుతో ఆయన పోరాడారు. ఏ క్షణమైనా పట్టు తప్పితే ప్రాణాలు గాల్లో కలిసిపోయే స్థితి. ఆ దృశ్యాన్ని చూస్తున్న చుట్టుపక్కల వారి గుండెలు ఆగిపోయినంత పనయ్యింది.
సమాచారం అందుకున్న వెంటనే జహంగీర్‌పురా, పాలన్‌పూర్, అడాజన్ ఫైర్ స్టేషన్ల నుంచి సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. కింద జనం రక్షణ వలలు పట్టుకోగా, అగి్నమాపక సిబ్బంది పదో అంతస్తు నుంచి తాళ్లు, సేఫ్టీ బెల్టులతో కిందకు దిగారు. గాలిలో వేలాడుతున్న నితిన్ భాయ్‌ను చాకచక్యంగా పట్టుకుని, ఆయన కాలిని గ్రిల్ నుంచి తప్పించారు. సురక్షితంగా ఎనిమిదో అంతస్తు కిటికీ గుండా అతన్ని లోపలికి లాగారు.
వెనుదిరిగిన మృత్యువు
నితిన్ భాయ్ సురక్షితంగా లోపలికి
వెళ్లగానే అపార్ట్‌మెంట్ నివాసితులంతా ఆనందంతో కేరింతలు కొట్టారు. ప్రాణాలతో బయటపడటం ఒక ఎత్తైతే, ఆ గంట సేపు ఆయన చూపిన ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అజాగ్రత్త ప్రాణాల మీదకు తెస్తుంది.. కానీ అదృష్టం కలిసొస్తే మృత్యువు కూడా వెనుదిరుగుతుందని ఈ ఘటన నిరూపించింది.


