
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఓ ప్రైవేట్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో 17 మంది విద్యార్థినులపై లైంగికంగా వేధింపులకు పాల్పడిన ఆరోపణలతో చైతన్యానంద సరస్వతిని ఢిల్లీ పోలీసులు యూపీలోని ఆగ్రాలో అరెస్టు చేశారు. తనను తాను ఆధ్మాత్మిక గురువుగా చెప్పుకునే చైతన్యానంద అలియాస్ పార్థ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
అర్ధరాత్రి వేళ గదికి పిలిపించుకుని..
ఢిల్లీలోని వసంత కుంజ్ ప్రాంతంలో గల ఒక ప్రైవేట్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో 17 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించడంతో పాటు మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్రలకు పాల్పడటం తదితర నేరాలపై అతడిని అరెస్టు చేశారు. బాధిత విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం చైతన్యానంద సరస్వతి తన ఫోన్ ద్వారా హాస్టల్లోని, క్యాంపస్‌లోని సీసీటీవీ ఫీడ్‌ల ద్వారా విద్యార్థినులను నిరంతరం గమనించేవాడు. టాయిలెట్ల వెలుపల కూడా కెమెరాలు అమర్చారని విద్యార్థినులు చెబుతున్నారు. హాస్టల్‌లో ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన సుమారు 75 మంది విద్యార్థినులు ఉన్నారు. వారిలో కొందరిని అర్ధరాత్రి వేళ బాబా తన గదికి బలవంతంగా రప్పించేవాడని, తమకు అసభ్యకరమైన టెక్స్ట్ మెసేజ్‌లు పంపించేవాడని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.
నమ్మకస్తులకు కీలక పదవులు
విద్యార్థినుల మొబైల్ ఫోన్లు, ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకుని వారిని బెదిరింపులకు గురిచేసేవాడు. దీంతో విద్యార్థినులు మరోమార్గం లేక అతని ఆదేశాలను పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో నమ్మకస్తులైన వారిని ఆశ్రమంలోని కీలక పదవులలో చైతన్యానంద సరస్వతి నియమించుకున్నాడు. దీనికి తోడు అతని ఆదేశాలను పాటించని లేదా సహకరించని విద్యార్థులను పరీక్షలలో ఫెయిల్ చేస్తామని బెదిరించేవాడని కూడా విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.
ఎఫ్‌ఐఆర్ నమోదయ్యాక రూ. 50 లక్షలు డ్రా..
ఈ కేసులో చైతన్యానంద సరస్వతి చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు శుక్రవారం నాడు కొట్టివేసింది. పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదైన తర్వాత చైతన్యానంద సరస్వతి వేర్వేరు పేర్లతో బ్యాంకు ఖాతాలను ఉపయోగించి, రూ. 50 లక్షలకు పైగా నగదు విత్‌డ్రా చేసుకున్నాడు. కాగా శంకరాచార్య మహాసంస్థానానికి చెందిన శారదా పీఠం ఆస్తులను ప్రైవేట్ కంపెనీలకు అద్దెకివ్వడం ద్వారా అతను ఇన్‌స్టిట్యూట్‌పై తన ఆధిపత్యం పెంచుకున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.