
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ఆశ్రమంలో పలువురు మహిళలను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చైతన్యానంద సరస్వతిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ దర్యాప్తులో పలు విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయి. చైతన్యానంద సరస్వతి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని పరిశీలించగా, మహిళల చిత్రాలు, వారితో చేసిన చాట్‌లు కనిపించాయి. ఈ చాట్‌లలో చైతన్యానంద సరస్వతి వివిధ హామీలతో పలువురు మహిళలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
చైతన్యానంద అలియాస్ పార్థ సారథి.. ఆశ్రమంలో పనిచేస్తున్న పలువురు మహిళా సిబ్బంది ఫోటోలను తన ఫోన్‌లో సేవ్ చేసుకున్నాడని పోలీసులు కనుగొన్నారు. ఈ చిత్రాలను అతను వారి సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాల నుంచి స్క్రీన్‌షాట్‌లను తీసుకుని సేవ్ చేసుకున్నాడని గుర్తించారు. వసంత్ కుంజ్‌లోని శ్రీ శారద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ అనే ప్రైవేట్ సంస్థ మాజీ డైరెక్టర్ అయిన చైతన్యానంద సరస్వతి పలువురు మహిళలకు అసభ్యకర సందేశాలు పంపడం, బలవంతంగా వారితో శారీరక సంబంధం పెట్టుకోవడం లాంటి ఫిర్యాదులు ఎదుర్కొంటున్నాడు. మహిళా హాస్టల్‌లో అతను రహస్య కెమెరాలు ఏర్పాటు చేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
50 రోజుల పాటు పరారీలో ఉన్న చైతన్యానంద సరస్వతిని రెండు రోజుల క్రితం ఆగ్రాలోని ఒక హోటల్‌లో పోలీసులు పట్టుకున్నారు. కాగా దర్యాప్తుకు చైతన్యానంద సహకరించడం లేదని, విచారణ సమయంలో అబద్ధాలు చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. ఐక్యరాజ్యసమితి, బ్రిక్స్ రాయబారిగా చైతన్యానంద సరస్వతిని పేర్కొంటూ రూపొందించిన రెండు నకిలీ విజిటింగ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కేటగిరీలో స్కాలర్‌షిప్ పొందుతున్న 17 మంది విద్యార్థినులు చైతన్యానంద సరస్వతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.