తిరువనంతపురం: కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్‌పై విజిలెన్స్ అండ్ యాంటీ–కరప్షన్ బ్యూరో (వీఏసీబీ).. సీబీఐ విచారణకు సిఫార్సు చేసింది. పునరావాస గృహనిర్మాణ ప్రాజెక్టు ‘పునర్జని’ నిధుల సేకరణలో అవకతవకలకు పాల్పడ్డారని, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ)ను ఆయన ఉల్లంఘించారని నివేదిక పేర్కొంది. ఈ మేరకు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు నివేదికను వీఏసీబీ అందజేసింది.
సొంత నియోజకవర్గం ఉత్తరపరవూర్‌లో 2018 వరదల్లో ఇళ్లు కోల్పోయిన కుటుంబాల కోసం గృహనిర్మాణ ప్రాజెక్టు ‘పునర్జని’ పేరుతో సతీశన్ విదేశాల నుంచి నిధులు సేకరించారు. అయితే సతీశన్ వ్యక్తిగత పర్యటన కోసం విదేశాలకు వెళ్లి, అక్కడ నిధులు సేకరించి, వాటిని కేరళలోని ఖాతాలకు బదిలీ చేశారని ఆరోపణలు వచ్చాయి.
మనప్పట్ పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌కు విదేశాల నుంచి డబ్బు అందిందని, యూకేలోని వివిధ వ్యక్తుల నుంచి 22,500 పౌండ్లు వసూలు చేసినట్లు విజిలెన్స్ గుర్తించింది. భారత పౌరులు విదేశీ విరాళాలు స్వీకరించడాన్ని నిషేధించే ఎఫ్‌సీఆర్‌ఏ చట్టం–2010ని సతీశన్ ఉల్లంఘించారని వీఏసీబీ ఆరోపించింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని వీడీ సతీషన్ తెలిపారు. నాలుగైదేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసు నిలబడదని గ్రహించే విజిలెన్స్ వదిలేసిందన్నారు. తన చర్యలు వంద శాతం సరైనవని, అందుకు తగ్గ ఆధారాలున్నాయని, ఎలాంటి దర్యాప్తుకైనా సిద్ధమని సతీశన్ స్పష్టం చేశారు. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలోనే తనపై కేసు పెట్టారని, దాన్ని రాజకీయంగా, చట్టబద్ధంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.


