ప్రాణం తీసిన ‘ఓటరు జాబితా విచారణ’ | Kolkata Man attend SIR hearing dies days after Appearing at Centre | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ‘ఓటరు జాబితా విచారణ’

Jan 5 2026 9:09 AM | Updated on Jan 5 2026 9:20 AM

Kolkata Man attend  SIR hearing dies days after Appearing at Centre

కోల్‌కతా: ఓటర్ల జాబితా ప్రక్షాళన దిశగా నడుంబిగించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో పెద్ద ఎత్తున ‘ఓటరు జాబితా విచారణ’ చేస్తోంది. అయితే ఇది అనుకోని ఘటనకు దారితీసింది. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూనే విచారణకు హాజరైన ఒక వృద్ధుడు కన్నుమూశాడు.

పశ్చిమ బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాల జిల్లాకు చెందిన నజితుల్ మొల్లా(68) గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాడు. గత డిసెంబర్ 20న ఆరోగ్యం క్షీణించడంతో కోల్‌కతాలోని ఒక ఆస్పత్రిలో చేరాడు.  ఇంతలో 2002 నాటి ఓటరు జాబితాలో అతని పేరు లేదంటూ, ఓటరు జాబితా విచారణ అధికారులు అతనికి నోటీసులు పంపారు. దీంతో  ఆయన ముక్కుకు ఆక్సిజన్ అందించే కాన్యులా గొట్టంతోనే  డిసెంబర్ 31న ఎన్నికల అధికారులు చెప్పిన విచారణ కేంద్రానికి వెళ్లారు.

విచారణ ముగించుకుని ఇంటికి చేరుకున్న మొల్లా ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ  విషయంలో ఆయన తీవ్ర ఆందోళన చెందారని, ఆ మానసిక ఒత్తిడే ఆయన ప్రాణాల మీదకు తెచ్చిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జనవరి 2న తిరిగి అదే ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఓటరు హక్కు కోల్పోతామనే భయంతో ఆయన ఆ గొట్టంతోనే  అధికారుల విచారణకు వెళ్లారని, ఆ ఒత్తిడిని ఆయన తట్టుకోలేకపోయారని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

నజితుల్ మొల్లా మృతితో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘంపై విరుచుకుపడింది. రాష్ట్రంలో ఓటర్ల విచారణ ప్రక్రియ కారణంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని, ఫలితంగా భయం,మానసిక ఒత్తిడి లేదా ఆత్మహత్యల కారణంగా 56 మంది వరకూ మరణించారని టీఎంసీ ఆరోపించింది. ఇది పేద ప్రజలను ఓటు హక్కుకు దూరం చేసేందుకు బీజేపీ పన్నిన కుట్ర అని స్థానిక నేతలు  ఆరోపిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాస్తూ, ఈ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: వెనెజువెలా: ఇప్పుడైతే యుద్ధం.. రోజూ రాత్రి వేళ లక్ష మెరుపులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement