రేషన్ కార్డుదారులకు రూ.3,000 నగదు బహుమతి
బియ్యం, చక్కెర, చెరకుగడ సైతం..
చెన్నై: పంట చేతికొచ్చేవేళ తమిళ ప్రజలు ఆనందోత్సవాల నడుమ జరుపుకునే ‘పొంగల్’ పండుగను పురస్కరించుకుని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రజలకు శుభవార్త తెలిపారు. ప్రతి రేషన్ కార్డు కుటుంబానికి రూ.3,000 నగదు బహుమతిని ఇవ్వనున్నట్లు స్టాలిన్ శనివారం ప్రకటించారు. బియ్యంకార్డ్ ఉన్న ప్రతి కుటుంబానికి రూ.3,000 నగదుతోపాటు ఒక కేజీ బియ్యం, ఒక కేజీ చక్కెర, ఒక చెరకుగడను ఉచితంగా పంపిణీచేయనున్నారు.
ప్రజాపంపిణీ సేవా కేంద్రాల ద్వారా ఒక ధోతీ, ఒక చీర సైతం ఉచితంగా పంపిణీచేయనున్నారు. దీంతో 2.22 కోట్ల రేషన్ కార్డు కుటుంబాలతోపాటు శ్రీలంక తమిళుల పునరావాస శిబిరాల్లోని కుటుంబాలు కూడా లబ్ధి పొందనున్నాయి. ఈ మొత్తానికి సుమారు రూ. 6,936.17 కోట్లు ఖర్చు అవుతుందని డీఎంకే సర్కార్ ఒక ప్రకటనలో పేర్కొంది.
తమిళనాడులో పొంగల్ సందర్భంగా ప్రతి ఏటా నిత్యావసర సరుకులు, కొంత నగదును బహుమతిగా ఇస్తోంది. 2011–16 కాలంలో అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ఇది కేవలం రూ. 100గా ఉండేది. ఆ తరువాత ఈ మొత్తాన్ని రూ.1,000కి పెంచింది. కొన్నేళ్లు నగదు బహుమతిని నిలిపేశారు. అయితే ఎన్నికల సంవత్సరం 2021లో ముఖ్యమంత్రి పళనిస్వామి నగదు సాయాన్ని ఒకేసారి రూ.2,500కి పెంచారు. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం ఆ సాయాన్ని రూ.3,000కి పెంచింది.


