
డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్న ఈ కాలంలో ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) పెద్ద మొత్తంలో జరిగే నగదు లావాదేవీల (Cash Transactions) విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. నిబంధనల ప్రకారం ఒక రోజులో ఎంతమేరకు నగదు లావాదేవీలు జరపాలో చట్టపరమైన పరిమితి గురించి అవగాహన ఉండకపోవచ్చు. వ్యక్తిగత అవసరాల కోసం లేదా వ్యాపార ప్రయోజనాల కోసం నగదును స్వీకరిస్తే ఎలాంటి నియమాలున్నాయో తెలుసుకుందాం. నిర్దిష్ట పరిమితికి మించి నగదు లావాదేవీలు నిర్వహిస్తే భారీ జరిమానాలు, చివరికి ఆదాయపు పన్ను నోటీసు కూడా రావచ్చని గుర్తుంచుకోవాలి.
సెక్షన్ 269ఎస్టీ
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269ఎస్టీ ప్రకారం ఏ వ్యక్తి కూడా ఒకే రోజులో రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదును స్వీకరించడానికి అనుమతుల్లేవు. ఈ పరిమితులు సదరు నగదు లావాదేవీ వ్యక్తిగతమా లేక వ్యాపారమా అనే దానిపై ఆధారపడవు. అంటే అందరికీ వర్తిస్తుంది.
ఉదాహరణకు: ఒక వ్యక్తి తన కారును అమ్మి కొనుగోలుదారు నుంచి రూ.2.5 లక్షల నగదు అందుకుంటే అది ఆదాయపు పన్ను చట్టానికి విరుద్ధం అవుతుంది. రూ.2 లక్షలకు మించి నగదును స్వీకరిస్తే ఆదాయపు పన్ను శాఖ మీరు తీసుకున్న మొత్తం నగదుకు సమానమైన జరిమానా విధించవచ్చు. ఉదా.. మీరు ఆస్తి లేదా వ్యాపార లావాదేవీల కోసం రూ.5 లక్షల నగదును స్వీకరిస్తే జరిమానా మొత్తం రూ.5 లక్షల వరకు ఉండవచ్చు. ఈ జరిమానాను సెక్షన్ 271డీఏ కింద విధిస్తారు. నగదును స్వీకరించిన వ్యక్తి మాత్రమే దీనికి జవాబుదారీగా ఉంటారు.
ఆర్థిక వ్యవస్థలో నల్లధనం (Black Money), పన్ను ఎగవేతలను అరికట్టడానికి ఉద్దేశించిన ప్రధాన చర్యల్లో భాగంగానే ఈ రూ.2 లక్షల నగదు లావాదేవీల పరిమితిని విధించారు. బ్యాంకు బదిలీలు, చెక్కులు లేదా ఇతర డిజిటల్ మార్గాల ద్వారా నిర్వహించే అన్ని పెద్ద లావాదేవీలు పారదర్శకంగా ఉండేలా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని స్వీకరించాలంటే బ్యాంకు (NEFT, RTGS, IMPS), చెక్కు లేదా డిమాండ్ డ్రాఫ్ట్, యూపీఐ లేదా ఇతర డిజిటల్ వాలెట్ల ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చు.
ఆదాయపు పన్ను శాఖ పర్యవేక్షణ వ్యవస్థ
ఆదాయపు పన్ను శాఖ అసాధారణమైన లేదా అధిక విలువ గల నగదు డిపాజిట్లు, ఉపసంహరణలను పర్యవేక్షించడానికి ఏఐ ఆధారిత డేటా విశ్లేషణను ఉపయోగిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతాలో రూ.10 లక్షలు లేదా కరెంట్ ఖాతాలో రూ.50 లక్షలకు మించిన నగదు డిపాజిట్లు లేదా ఉపసంహరణలు చేస్తే ఆదాయపు పన్ను శాఖ హెచ్చరికలు జారీ చేయవచ్చు.
ఇదీ చదవండి: గోల్డ్ ఢమాల్.. భారీగా తగ్గిన బంగారం ధరలు