లక్నో: సుమారు రూ.3,700 కోట్ల సైబర్ నేరానికి పాల్పడిన ఆరోపణలపై జైలులో ఉన్న ఓ వ్యక్తి..పోలీస్ కానిస్టేబుల్ ఫోన్ నుంచి అలహాబాద్ హైకోర్టు జడ్జికి బెదిరింపు మెయిల్ పంపించడం సంచలనం రేపింది. అనుభవ్ మిట్టల్ అనే వ్యక్తి ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో దాదాపు 7 లక్షల మందిని మోసం చేశాడు. ప్రస్తుతం లక్నో జైలులో ఉన్న ఇతడిపై ఈ మేరకు కేసు నమోదైంది. ఇతడు అజయ్ అనే పోలీస్ కానిస్టేబుల్ సెల్ ఫోన్ ద్వారా అలహాబాద్ హైకోర్టు జడ్జికి బెదిరింపు మెయిల్ పంపాడు. మరో ఖైదీని ఇరికించేందుకు మారుపేరుతో ఇతడు.. ‘లక్నో బెంచ్‌లోని ఓ జడ్జిని చంపేస్తాం’అంటూ మెసేజీ పంపాడు.
దీనిపై శుక్రవారం కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కానిస్టేబుల్ అజయ్‌ని ప్రశ్నించారు. ఈ నెల 4వ తేదీన కోర్టు విచారణకు వచ్చిన మిట్టల్ వెంట కానిస్టేబుల్ అజయ్ ఉన్నాడు. తన కేస్ స్టేటస్ చూస్తానంటూ ఫోన్‌ను తీసుకున్న మిట్టల్ కొత్త మెయిల్ ఐడీ సృష్టించి బెదిరిస్తూ మెయిల్ పంపించాడు. హత్య కేసులో అదే జైలులో 2023 నుంచి ఉంటున్న తన విరోధి ఆనందేశ్వర్ అగ్రహారీని ఈ కేసులో ఇరికించేందుకు మిట్టల్ కుట్ర పన్నినట్లు తెలిందని అధికారులు తెలిపారు.


