తెలుగు భాషకూ, సాహిత్యానికీ అనుపమాన సేవలు చేశారు సి.పి. బ్రౌను (CP Brown) వేమన పద్యాలు వెలుగు చూడటానికి ఆయనే కారణం. అలాగే ఆయన రూపొందించిన ‘తెలుగు–ఇంగ్లీషు నిఘంటువు’ ఇప్పటికీ ప్రామాణికమైనదిగానే వెలుగొందుతోంది. బ్రిటిష్ అధి కారిగా వచ్చిన బ్రౌను తెలుగు కోసం సర్వస్వాన్నీ అర్పించారు. అటువంటి బ్రౌనుపై ఎందరో గద్య, పద్య రచనలు చేశారు.
‘వైదర్భీపరిణయం’ కవి మచ్చా వెంకటకవి తన పద్యంలో ‘తానాంధ్ర వి/ద్యా పాండిత్యము మేటి గ్రంథ పఠనాద్యస్తోక నైపుణ్యమున్/ జూపెన్ రాజమహేంద్ర పట్టణమునన్ సూర్యుత్త ముల్ మేలనన్’ అంటూ పండితుల అభిమానం బ్రౌను ఎలా పొందారో రాశారు. ఇక ములుపాక బుచ్చయ్య కవి ‘నూర్లార్లు లెక్కసేయక/ పేర్లెక్కిన విబుధవరుల పిలిపించుచు, వే/మార్లర్థ మిచ్చు వితరణి/ చార్లీసు ఫిలిప్పుబ్రౌను సాహెబు కరుణన్’ అన్న పద్యం బ్రౌను వదాన్యత తెలిపే ప్రశస్త పద్యమైంది. పిండిప్రోలు లక్ష్మణ కవి ఏకంగా బ్రౌనును హరి, శ్రీకృష్ణుడు అంటూ ప్రస్తుతి చేశారు. భట్రాజు రామన కవి అయితే ప్రేమతో బ్రౌనుపై దండకాన్నే రాసి ‘శారదా శారదా భ్రమందార కుంద/ చందనాంచితకీర్తి, బ్రౌను చక్రవర్తి’ అని అభివర్ణించారు.
పుట్లూరు శ్రీనివాసాచార్య కవి బ్రౌను సేవను ఒక సీసంలో ‘ఆంగ్లేయుడైయుండి ఆంధ్రలో ‘కడప’ను / తన జన్మభూమిగా తలచెనెవడు / తాటియాకుల జీర్ణ దశనున్న ప్రతు లకు/ కొత్త జీవము పోసి కొలచె నెవరు/ లోపించు పదజాల రూపమ్ము నిలుపగా/ తెలుగు నిఘంటువుల్ మలచె నెవడు/ఛందోగతుల తేనె విందులు సమ కూర్చి/ ప్రియ జానపద వాణి పిలిచె నెవడు’ అంటూ ఆయన సేవలను కళ్లకు కట్టారు.
శతావధాని సి.వి. సుబ్బన్న ‘కులమును కాలమున్ స్థలము కొండొక గుర్తు లభింపదయ్యె’ అనే పద్య రత్నాన్ని అందించారు. బెజవాడ గోపాల రెడ్డి ఒక దీర్ఘ వచన కవితా ఖండికలో ‘క్రొత్త రెక్కలతో కావ్యవిహంగము/ క్రొత్త దేశాలకు ఎగిరింది/ క్రొత్త వనాల గూడు కట్టింది/ దీర్ఘసుప్త శిల అహల్యయై లేచింది’ అంటూ బ్రౌను వల్ల వచ్చిన సాహిత్య చైతన్యాన్ని కవితాపరంగా చెప్పారు. రాధశ్రీ అందాల కందాలలో బ్రౌనుకు నివాళి పలికారు. ‘సి.పి. బ్రౌను పరాయి పండితుడటే’ అంటూ ఆరే దీపాన్ని పట్టుకుని ఆంధ్రీకావ్యా లకు చీకటెక్కడుందని చీకటిని చీల్చాడన్నారు. ఆచార్య ఎన్. గోపి బ్రౌను పరిశోధక కవి– ‘బ్రౌనుకు నమస్కారం’ అనే అవిస్మరణీయ భావాత్మక కవిత వ్రాస్తూ ‘ఆరిపోతున్న భాషా దీపానికి/ ఊపిరిలోంచి/ ప్రాణవాయువు దానం చేసిన సంజీ వనుడు’ అని సమున్నతంగా చెప్పారు.
పద్యాలు, వచనకవితా ఖండికలు ఇలా వస్తే బ్రౌనుమీద ఒక కావ్యమే వచ్చింది. ‘సి.పి. బ్రౌను ఉదాహరణ కావ్యం’గా రాసిన కవి సన్నిధానం నరసింహశర్మ. ఇది బ్రౌనుపై వచ్చిన ప్రథమ కావ్యం. ఆరుద్రకి అంకితం. ‘సూర్యుడు వచ్చే పచ్చలను చూడుడు వెల్గుల నక్షరాల సౌం/దర్యపు భాష బ్రాకృతిక ధన్యనిఘంటువు చాటి చెప్పు స/త్కార్య విజృంభణార్థ సుముఖ ప్రభ కన్పడెతాటి చెట్టులన్ / ధైర్యము గల్గ తెల్గులకు దారుడు సూర్యుడెచూపు హేతువుల్’ వంటి ఆలోచనాత్మక భావాల, పద్యాల కేళికో త్కళికలతో ఈ కావ్యం భావరస ప్రధానమైంది.
ఇలా కవుల సహృదయ కవితా నీరాజనాల నందుకున్న సి.పి. బ్రౌను ధన్యుడు. మహామహులైన కవులు తెలియచేసినట్లు మనం తాళపత్ర గ్రంథాలు సేకరించకపోయినా ఫరవాలేదు. కొత్తగా నిఘంటువులు వ్రాసి తెలుగుకు ఘనకీర్తి తేనవసరం లేదు. మన మన పిల్లలతో తెలుగు పుస్తకాలు చదివించగలిగితే – అదే మన భాషను కాపాడినట్లు! బ్రౌను దొరకు మనం ఇచ్చే ఘన నివాళి ఇదే.
– పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి,
రచయిత–రిటైర్డ్ హెడ్ మాస్టర్


