Sonia Gandhi: కాంగ్రెస్‌ ముందు కఠిన సవాళ్లు 

Congress Revival Essential For Democracy And Society: Sonia Gandhi - Sakshi

అన్ని స్థాయిల్లోనూ ఐక్యంగా ఉండండి 

ప్రభుత్వ విధానాలపై గట్టిగా పోరాడండి 

సీపీపీ భేటీలో సోనియా గాంధీ పిలుపు

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ముందు మునుపెన్నడూ లేని సవాళ్లున్నాయని ఆ పార్టీ చీఫ్‌ సోనియాగాంధీ అన్నారు. క్లిష్టమైన ఈ పరీక్షా సమయంలో పార్టీ శ్రేణులు అన్ని స్థాయిల్లోనూ ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. మంగళవారం జరిగిన కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) సమావేశంలో సోనియాగాంధీ ప్రసంగించారు. ‘అధికార బీజేపీ అన్ని రాష్ట్రాల్లో విభజన ఎజెండాను అమలు చేస్తోంది. ఎజెండాను బలపరిచేందుకు చరిత్రను వక్రీకరిస్తోంది’అంటూ మండిపడ్డారు.

ఆకాశన్నంటుతున్న ధరలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దీనిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ పార్టీ గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంపై ఆమె స్పందిస్తూ.. ‘అనూహ్యమైన, బాధాకరమైన ఈ ఫలితాలను చూసి మీరెంత నిరుత్సాహానికి గురైందీ నాకు తెలుసు. ఈ ఫలితాల అనంతరం ఏర్పాటైన సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీని ఎలా బలోపేతం చేయాలనే విషయమై పలువురు కీలక సూచనలు చేశారు. వీటిని ప్రస్తుతం పరిశీలిస్తున్నాం.

పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లను ఎలా అధిగమించాలనే విషయంలో రోడ్‌ మ్యాప్‌ను రూపొందించేందుకు ‘చింతన్‌ శిబిర్‌’ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది’అని సోనియా అన్నారు. ‘పార్టీ శ్రేణులు అన్ని స్థాయిల్లోనూ ఐకమత్యంగా మెలగడం అత్యంత అవసరం. ఇందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటాం’అని చెప్పారు. ‘కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కేవలం మనకే మాత్రమే కాదు, దేశంలో ప్రజాస్వామ్యానికి, సమాజానికి ప్రస్తుతం అత్యంత కీలకం’అని తెలిపారు.

దేశంలో పరిణామాలపై సోనియా గాంధీ మాట్లాడుతూ..‘పారిశ్రామిక రంగం అత్యంత ప్రమాదకరంగా ఉంది. ప్రభుత్వం రైతులకిచ్చిన వాగ్దానాలను అమలు చేస్తుందనేందుకు ఎటువంటి సూచనలు కనిపించడం లేదు. నిత్యావసరాల ధరలు రోజురోజుకూ భరించలేనంతగా పెరుగుతున్నాయి. ఎరువులు, ఇంధన ధరలు ఆకాశాన్నంటున్నాయి. వీటి నుంచి ప్రజలను కాపాడేందుకు కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా ఉద్యమించాలి’అని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ ఆహార భద్రతా చట్టం, గ్రామీణ ఉపాధి హామీ చట్టాలను ప్రధాని సహా ఇప్పటి ప్రభుత్వ నేతలు విమర్శించినా ఈ పథకాలు గడిచిన రెండేళ్లలో దేశంలోని కోట్లాది మంది ప్రజలను కాపాడాయన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ తీవ్ర వైఫల్యం తర్వాత జరిగిన ఈ భేటీలో పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతోపాటు మాజీ ప్రధాని మన్మోహన్, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు.  

చదవండి: శివసేన ఎంపీకి ఈడీ షాక్‌.. ‘కాల్చండి, జైలుకు పంపండి, భయపడేది లేదు’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top